గడువులోగా కష్టమే!
● సర్వేను 18లోగా పూర్తి చేయాలని సూచించిన ప్రభుత్వం
● ఒక్కో ఎన్యుమరేటర్‌కు 170 వరకు ఇళ్ల కేటాయింపు
● ఇంకా నమోదు చేయాల్సిన ఇళ్లు 30శాతంపైనే..
● గడువు పెంచాలని కోరుతున్న
సిబ్బంది
మోర్తాడ్/నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి కావడం కష్టమే. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 నుంచి 170 వరకు ఇళ్లను కేటాయించి సర్వేను అప్పగించారు. ఈ నెల 6న సర్వే ఆరంభం కాగా 18 తో ముగించాలని ప్రభుత్వం మొదట్లో నిర్దేశించింది. సర్వే ఆరంభించిన మొదట్లో ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 5 నుంచి 10 కుటుంబాల వివరాలను మాత్రమే నమోదు చేయగలిగారు. సర్వేపై పట్టు పెరిగిన కొద్ది ఇంటింటి వివరాల సేకరణ పెంచినా.. గడువు ముగిసేలోగా సర్వే పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదు. సెలవు దినాలలో కూడా సర్వేను కొనసాగిస్తున్నారు.
జిల్లా మొత్తంలో 4.69లక్షలకు పైగా ఇండ్లను సర్వే చేయాల్సి ఉంది. ఇందుకోసం 3,453 మంది ఎన్యుమరేటర్‌లను నియమించారు. వీరిని 358 మంది సూపర్‌వైజర్లు అజమాయిషీ చేస్తున్నారు. శనివారం నాటికి 62.86 శాతం సర్వే పూర్తి అయ్యింది. రెండు రోజుల్లో 37.14 శాతం పూర్తి కావాల్సి ఉంది. రెండు రోజుల్లో అంత వేగంగా సర్వే పూర్తి అయ్యే పరిస్థితి లేదని మరో రెండు, మూడు రోజుల గడువు పెంచితేనే బాగుటుందని ఎన్యుమరేటర్లు అంటున్నారు. ఒక్కో కుటుంబం నుంచి 75 ఆంశాలపై వివరాలను నమోదు చేయడానికి అరగంటకు పైగా సమయం పడుతుంది. రోజుకు ఒక ఎన్యుమరేటర్ 20 కుటుంబాల సర్వే పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కానీ 10 నుంచి 15 కుటుంబాల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. ఒక్క ఇంటిని కూడా వదలిపెట్టకుండా సర్వే పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఎన్యుమరేటర్లకు నిర్దేశించారు. సర్వేకు గడువు పెంచే అంశంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రంలోగా గడువు పెంచే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment