యాసంగికి భరోసా!
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతుండడంతో యాసంగిపై ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిధిలో యాసంగి సీజన్‌లో 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటి ఆయకట్టు కింద అలీసాగర్ రిజర్వాయర్ వరకు వరి పంటల సాగుతో పాటు 10 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయనున్నారు. ఆయకట్టు కింద పంటల సాగు అవసరాలతో పాటు పంటలను పూర్తిస్థాయిలో గట్టెక్కించేందుకు 7 విడతల్లో 12 టీఎంసీల నీటిని విడుదల చేయాలని యోచిస్తున్నారు. ప్రధాన జలాశయాల నుంచి నీటి విడుదలతో పాటు ఆయకట్టు కింద పంటల సాగుపై చర్చించేందుకు రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌లో శివం కమిటీ సమావేశం కానుంది. మంత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు పోచారం ప్రాజెక్టు, కౌలాస్ నాలా ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు నీటి విడుదల, పంటల సాగుకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెలాఖరు నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు నీటిని అందించే అవకాశాలున్నాయి. నారుమళ్లను సిద్ధం చేసుకోవడానికి ముందస్తుగా ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో అన్నదాతలు సాగు పనులకు సన్నద్ధమవుతున్నారు.
నిజాంసాగర్ కింద 1.25 లక్షల ఎకరాల్లో పంటల సాగు
7 విడతల్లో 12 టీఎంసీల
విడుదలకు ప్రతిపాదనలు
నారుమళ్ల కోసం నీటిని విడుదల చేస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment