మోర్తాడ్ డిగ్రీ కళాశాలకు కొత్త సొబగులు
మోర్తాడ్: మోర్తాడ్ డిగ్రీ కళాశాలకు కొత్త సొబగులు దిద్దుకుంటున్నాయి. అదనపు గదుల నిర్మాణం, విద్యా సామాగ్రికి ప్రధాన మంత్రి ఉచ్ఛతర శిక్ష అభియాన్(పీఎం ఉషా) పథకం కింద రూ.5 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులు అందుకున్న ఏకై క కళాశాల మోర్తాడ్ కావడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మోర్తాడ్‌కు డిగ్రీ కళాశాలను మంజూరు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా తెలంగాణ ఆవిర్భవం తర్వాత నిర్మాణం పూర్తి చేసుకుంది. బీఏ, బీకాం కంప్యూటర్స్, జనరల్, బీఎస్సీ మ్యాథ్స్, బీజడ్‌సీ, కంప్యూటర్స్ కోర్సుల్లో విద్యార్థులకు ఉన్నత విద్య అందుతోంది. ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో బోధన సాగుతోంది. మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, వేల్పూర్ మండలాల విద్యార్థులకు డిగ్రీ విద్యను అందిస్తున్న మోర్తాడ్‌లో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేయవచ్చని అధికారులు భావించారు. ఇదిలా ఉండగా ఉన్నత విద్యామండలి చొరవతో ఉద్యోగ అర్హత పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్‌సీసీ కెడెట్ క్యాంప్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్మీ అధికారులు పరిశీలన చేపట్టారు. ఇప్పటికే ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపులను నిర్వహిస్తూ విద్యార్థులను సమాజ సేవలో తరలించేలా అధ్యాపకుల బృందం కృషి చేస్తోంది. అదనపు గదుల నిర్మాణం, విద్యా సామాగ్రి కొనుగోలుతో విద్యార్థులకు మరిన్ని మెరుగైన విద్య సేవలు అందడానికి అవకాశం ఏర్పడనుంది. పీఎం ఉషా పథకం కింద మంజూరైన నిధులతో అదనపు గదులను ప్రస్తుతం ఉన్న భవనంపై నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదనపు గదుల నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు పీజీ సెంటర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదనపు గదుల నిర్మాణం, విద్యా సామగ్రికి రూ.5 కోట్లు మంజూరు
పీఎం ఉషా పథకం కింద నిధులు
మంజూరు చేసిన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment