సృష్టికి మూలం మహిళలు
ఖలీల్‌వాడి: సృష్టికి మూలం మహిళలు అని.. మహిళలు లేనిది సృష్టి లేదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి పద్మావతి, డీసీపీ బస్వారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ మహిళ హింస వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించబడుతున్న సఖి సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, ట్రైనీ కలెక్టర్ సాకేత్ కుమార్, డీసీపీ బస్వారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి హాజరై మాట్లాడారు. కుటుంబంలోని మహిళల మధ్య సఖ్యత, సమన్వయం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తలేవని అన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో పెద్దలు మంచి, చెడు గురించి పిల్లలకు చెప్పకపోతే మహిళల సంరక్షణార్ధం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి వ్యర్థమే అని అన్నారు. సుమారు కొన్ని వేల గృహహింస కేసులు, వరకట్న వేధింపుల కేసులు నమోదు కావడం బాధకరమని జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో జరిగే చిన్నపాటి గొడవలను చూసీచూడనట్లు వ్యవహరిస్తే కేసులు నమోదు కావన్నారు. అనంతరం చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో సేవలు అందించే మహిళలను సన్మానించారు. వైద్య రంగంలో డాక్టర్ రోహిణి, న్యాయవాద వృత్తిలో వసంత కుమారి, టీచింగ్‌లో ఎన్ విమల, సమాజ సేవలో లక్ష్మీదేవి, క్రీడా రంగంలో శ్రీవాణి, పారిశ్రమిక రంగంలో లతను సన్మానించారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, సఖి అడ్మినిస్ట్రేషన్ భానుప్రియ, కౌన్సిలర్లు, సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి పద్మావతి
Comments
Please login to add a commentAdd a comment