నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తాం
బోధన్‌రూరల్ : నిజాం షుగర్స్ పునరుద్ధరణకోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు. చెరుకు సాగుపై అవగాహన కల్పించేందుకు చెరుకు పరిశోధన కేంద్రం (రుద్రూర్) శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సుదర్శన్‌రెడ్డి రైతులతో సోమవారం సాలూరలోని రైతు వేదికలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నడిచే చెరుకు ఫ్యాక్టరీ మూతపడటంతో బోధన్, జహీరాబాద్, మెదక్ ప్రాంతాల రైతులు చెరుకు సాగుకు దూరమయ్యారన్నారు. ఎన్నికల హామీ మేరకు నిజాంషుగర్స్‌ను తెరిపించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. రైతులు చెరుకు సాగు చేసేందుకు ముందుకురావాలని ఆయన కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు నూతన చెరుకు వంగడాలు, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు ఎల్లప్పుడూ వరిని మాత్రమే సాగు చేయకుండా పంట మార్పిడి అలవర్చుకోవాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించొచ్చని అన్నారు. తీగజాతి కూరగాయ పంటలు సాగు చేసే రైతులకు పందిళ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. సన్న ధాన్యం సాగుచేసిన రైతుల ఖాతాల్లో రూ.500 చొప్పున బోనస్ జమ చేశామని, త్వరలో అర్హులందరికీ రేషన్ షాప్‌ల ద్వారా సన్న బియ్యం అందిస్తామన్నారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఫ్యాక్టరీని తెరిపించేందుకు
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
చెరుకు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలి
శాస్త్రవేత్తలు సూచించే నూతన
చెరుకు వంగడాలతో అధిక దిగుబడి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సుదర్శన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment