మహాలక్ష్మి ఎదురుచూపు
మోర్తాడ్(బాల్కొండ): బీడీ కార్మికురాలైన మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మికి ఆసరా పథకం కింద జీవన భృతి అందలేదు. అప్పటి ప్రభుత్వం బీడీ కార్మికుల పింఛన్‌కు కటాఫ్ నిబంధనలను పెట్టి మళ్లీ ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఇలా రాజ్యలక్ష్మితోపాటు మరెందరో మహిళలకు ఏ విధమైన పింఛనూ అందడం లేదు. అలాంటి గృహిణులందరికీ ప్రతినెలా మహాలక్ష్మి పథకం ద్వారా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగానే మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన నాయకులు మొదటి నుంచి చెబుతున్నారు. ఆరు గ్యారెంటీల హామీల అమలు కోసం 2024–25 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.53,196 కోట్లు కేటాయించింది. అయినప్పటికీ ఏడాది గడిచిపోయే పరిస్థితి ఉన్నా మహాలక్ష్మి సాయంపై స్పందన కరువైంది. ‘మహాలక్ష్మి’ సాయం కోసం 3,55,347 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. దరఖాస్తుదారుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో 77,158 మంది వితంతులు, 10,520 మంది ఒంటరి మహిళలు, 96,264 మంది బీడీ కార్మికులకు పింఛన్‌లు అందుతున్నాయి. ఆసరా పథకం కింద లబ్ది పొందుతున్నవారికి మహాలక్ష్మి సాయం అందించే అవకాశం లేదు. మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తే జిల్లాలో సుమారు 40వేల మంది లబ్ధిపొందే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తేనే ప్రతి నెలా సాయం అందుకునేవారి విషయంలో స్పష్టత రానుంది. ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేస్తుందోనని మహిళలు నిరీక్షిస్తున్నారు.
మహాలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికపై ప్రభు త్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని, దరఖాస్తులు అందించగా వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉంచామని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల తెలిపారు.
అందని రూ.2,500 ఆర్థికసాయం
ఏడాదైనా ముందుకు పడని అడుగులు
నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా ఫలితం శూన్యం
Comments
Please login to add a commentAdd a comment