ఎన్‌సీఎస్‌ఎఫ్‌ను బెల్లం ఫ్యాక్టరీగా మార్చాలి
నిజామాబాద్ రూరల్ : సారంగాపూర్ చక్కెర కర్మాగారాన్ని బెల్లం ఫ్యాక్టరీగా మార్చి నడపాలని ఎన్సీఎస్‌ఎఫ్ చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్‌ను కోరారు. రైతులు సోమవారం గడుగును నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహకార చక్కెర ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం 1964 చట్టం ప్రకారం నడపాలని, రైతులు చెరుకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వరితో పోలిస్తే చెరుకు సాగు రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. సహకార చక్కెర సంఘం సభ్యులుగా 23వేల మంది ఉన్నప్పటికీ 6వేల మంది రైతులు రెగ్యులర్‌గా చెరుకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 6వేల మంది వ్యవసాయ కూలీలకు, ఫ్యాక్టరీలో 500 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని కొందరు రాజకీయ నాయకులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు పూర్తి సహాయసహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందించే విధంగా కృషి చేయాలని గడుగుకు విజ్ఞప్తి చేశారు. గడుగును కలిసిన వారిలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు బొడ్డు గంగారెడ్డి, ఆకుల పాపయ్య, బి.లక్ష్మణ్‌రెడ్డి, సాయిరెడ్డి, కృష్ణాగౌడ్, నగేశ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment