
అడుగులన్నీ కొండగట్టు వైపే..
మహిమాన్విత పుణ్యక్షేత్రం..
ఆర్మూర్: హనుమాన్ మాలధారులు, భక్తుల అడుగులన్నీ కొండగట్టు వైపే వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో భక్తులు ఇటీవల పాదయాత్రగా వెళ్లగా ఈ నెల 12న హనుమాన్ జయంతి పురస్కరించుకొని స్వామివారి దర్శనం చేసుకోనున్నట్లు వారు తెలిపారు. జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ గుంపులుగా పాదయాత్రగా వెళ్లడం ద్వారా అంజన్న కరుణ తమపై ఉంటుందన్నది భక్తుల నమ్మకం.
జిల్లా కేంద్రం నుంచి 113కి.మీ.
జిల్లా కేంద్రం నుంచి కొండగట్టు 113 కిలో మీటర్ల దూరం రాగా.. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ నుంచి 85 కిలో మీటర్ల దూరంలో ఉంది. జిల్లాలోని నలుమూలల నుంచి హనుమాన్ మాలధారణ చేసిన భక్తులతో పాటు మాలధారణ చేయని భక్తులు సైతం తమ మొక్కలు తీర్చుకోవడానికి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లడం ప్రారంభించారు. అలాగే దీక్ష విరమణ కోసం ఎక్కువగా కొండగట్టుకు వెళ్తుంటారు. జిల్లా నుంచి భక్తుల పాదయాత్ర సుమారు మూడు నుంచి నాలుగు రోజుల వరకు సాగనుంది. పాదయాత్ర విడతల వారిగా చేపడతారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. విశ్రాంతి తర్వాత వేకువజామున ప్రారంభించి ఉదయం 10గం.వరకు చేపడతారు. అనంతరం సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకుంటారు. పాదయాత్రలో భక్తులు కొందరు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మరికొందరు పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు. మండుటెండలో వేసవి తాపాన్ని భరిస్తూ 63వ నెంబర్ జాతీయ రహదారి పొడవునా భక్తులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
2017 నుంచి..
ఆర్మూర్ పట్టణం పెర్కిట్ శివారులోని హనుమాన్ మందిరం నుంచి హనుమాన్ భక్తులు 2017 నుంచి పాదయాత్రగా కొండగట్టుకు వెళ్లడం ప్రారంభించారు. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు వీరికి అనుమతి లభించకపోవడంతో ఈ పర్యాయం ఏడోసారి కాలినడకన కొండగట్టు అంజన్నను చేరడానికి పాదయాత్రగా బయల్దేరారు. బుధవారం వారు పాదయాత్ర చేపట్టగా నేడు కొండగట్టు చేరుకోనున్నారు. మాల ధారణ చేయకుండా మండల దీక్ష, అర్ధ మండల దీక్ష, 11 రోజుల దీక్షను నిష్టతో పూర్తి చేసుకొని సుమారు 20 మందితో కూడిన భక్త బృందం ప్రతీ ఏటా పాదయాత్రగా వెళ్లి అంజన్న దర్శనం చేసుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దగ్గరలో కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది. వందల ఏళ్ల నుంచి ఇక్కడ హనుమంతుడిని కొలుస్తుంటారు. ఇక్కడ స్వయంభువుగా హనుమంతుడు వెలిశాడని చెబుతుంటారు. అంజనీపుత్రుడు సంజీవని పర్వతం చేతుల్లో పట్టుకుని గాల్లో వస్తుంటే. ముత్యంపేట దగ్గరలో ఓ ముక్క పడిందని ఇక్కడ ఓ కథ ప్రసిద్ధి. ఆ భాగాన్నే కొండగట్టుగా పర్వత భాగంగా చెబుతుంటారు. ఇక్కడి కొండల్లో ఎన్నో ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. కోతుల దండు కూడా ఎక్కువగానే ఉంటుంది.
జిల్లావ్యాప్తంగా పాదయాత్రగా
వెళుతున్న హనుమాన్ భక్తులు
హనుమాన్ జయంతి రోజున
అంజన్న దర్శనం కోసమే..