వక్ఫ్ భూములు.. ఉఫ్
గుడ్లవల్లేరు: జిల్లాలోని వక్ఫ్‌బోర్డు భూములు కబ్జా కోరల్లో మగ్గుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని మసీదులు, ఫకీరు చావిడిల భూములు ఏళ్ల తరబడి ఆక్రమణల చెరలో ఉన్నా పట్టించుకున్నవారే లేరు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 372 మసీదులు, ఫకీర్ చావిడిలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 2,653.56 ఎకరాల్లో వక్ఫ్ భూములున్నాయి. వీటిలో 984.08 ఎకరాలు ఆక్రమణల చెరలో ఉన్నాయి. కబ్జాకు గురైన భూముల్లోని 636.54 ఎకరాల్లో భూముల స్వాధీనానికి అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్, ఎస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కట్టా హర్షవర్ధన్ ఈ ఏడాది అక్టోబర్ 10న ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు వాటిని స్వాధీనం చేసుకోవడంలో వక్ఫ్‌బోర్డుల అధి కారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వక్ఫ్ భూములు ఆక్రమణలకు గురవడంతో చట్ట ప్రకారం ఆక్రమిత భూములను కలెక్టర్ స్వాధీనం చేసుకోవాలని కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఆక్రమణదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఆక్రమణ దారుల పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు వచ్చాయి.
ఆక్రమణల డొంక కదిలింది ఇలా...
ఇటీవల కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీకి ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ జిల్లాలోనే పమిడిముక్కల మండలం ఫతేలంక మసీదు మాన్యం ఆక్రమణలో ఉన్నట్లుగా వినతిని అందించారు. అంతకు ముందే రాష్ట్రంలో ఆక్రమణలోని వక్ఫ్‌బోర్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఉప లోకా యుక్తను రాత పూర్వకంగా కోరారు. రాష్ట్ర ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజని ఉత్తర్వుల మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తగు చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వులు ఇచ్చారు.
ఉమ్మడి కృష్ణాలో 984.08 ఎకరాలు కబ్జా
ఆక్రమణల భూములు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు!
Comments
Please login to add a commentAdd a comment