పోలీస్ ప్రజావాణిలో 74 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(ప్రజావాణి) కార్యక్రమంలో 74 మంది ఫిర్యాదులు అందజేశారు. డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఉదయరాణి ఫిర్యాదుదారులతో మాట్లాడిన అనంతరం ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, మోసాలు, సైబర్ నేరాలపై ఫిర్యాదులందజేశారు. ఫిర్యాదులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ అధికారులను డీసీపీ ఆదేశించారు.
28న విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు
చిలకలపూడి(మచిలీపట్నం): అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన ఉమ్మడి కృష్ణాజిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.కామరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 6 నుంచి 15 సంవత్సరాల వరకు, 15 ఏళ్లు పైబడిన విభిన్న ప్రతిభావంతుల బాలబాలికలకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తారన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆసక్తి కలిగిన విభిన్న ప్రతిభావంతులు ఆటల పోటీలో పాల్గొని డిసెంబర్ 3వ తేదీన జరిగే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని తెలిపారు.
పోలవరం కాలువలో గల్లంతైన మరో యువకుడు మృతి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): జక్కంపూడి సమీపంలో ని పోలవరం కాలువలో ప్రమాదవశాత్తూ పడిపోయిన ఇద్దరు యువకులు కథ విషాదాంతమైంది. సెల్ఫీలు దిగడం కోసమని తమ స్నేహితులతో కలిసి ఈ నెల 22వ తేదీన జక్కంపూడి సమీపంలోని పోలవరం కాలువ వద్దకు వెళ్లిన సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన యువకులు ఉప్పల శివతేజ(18), ఎండీ మున్వర్(18) ప్రమాదవశాత్తూ ఆ కాలువలో పడిపోయి గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం శివతేజ మృతదేహం లభ్యమైన ఫెర్రీ వద్దే మున్వర్ మృతదేహం కూడా సోమవారం కనబడింది. దీంతో పోలీసులు మున్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గల్లంతైన ఇద్దరు యువకులు మృత్యువాత పడడంతో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment