విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలి
గన్నవరం: విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రధానితో ఆ ప్రకటన చేయించే బాధ్యత సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పైనే ఉందన్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలోని సీపీఐ కార్యాలయానికి విచ్చేసిన ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ప్రైవేట్ ఫ్యాక్టరీలకు గనులను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలో ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత తమదని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందన్నారు. అమెరికాలో నమోదైన కేసు దృష్ట్యా గౌతమ్ అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదానీని వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరిపించాలన్నారు. పార్టీ నేతలు కేవీవీ. ప్రసాద్, టి. తాతయ్య, పెద్దు వాసుదేవరావు, పి. ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment