వలంటీర్ల జీవితాలు తలకిందులు
ధర్నా చేసిన వలంటీర్ అసోసియేషన్ నాయకులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్ నందు వ్యవస్థను కొనసాగించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.10వేలు జీతం ఇవ్వాలని కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నాలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తలకిందులుగా నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం గోవిందరాజులు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, రూ. 10వేలకు జీతం పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టగానే వలంటీర్ల జీవితాలను తల్లకిందులు చేశారన్నారు. తమను నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి సమావేశాల్లో వలంటీర్ వ్యవస్థ లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు కంచర్ల భార్గవ్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకే సాయి, వలంటీర్ అసోసియేషన్ నాయకులు జి.మమత, శిరీష, రాజకుమార్, రమేష్, అబ్దుల్, నారాయణ, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment