పీజీలు శస్త్ర చికిత్స నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సర్జరీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వైద్య విద్యార్థులు శస్త్ర చికిత్సా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ డీవీఎల్ నరసింహం అన్నారు. జాన్సన్ అండ్ జాన్సర్ కంపెనీ ఆధ్వర్యంలో సర్జరీ పీజీలకు శస్త్ర చికిత్సలపై నైపుణ్యాలు పెంచేందుకు ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని నరసింహం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శస్త్ర చికిత్సల్లో అందుబాటులోకి వస్తున్న అధునాతన విధానాలపై పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఇప్పటికే ఆరోగ్య విశ్వ విద్యాలయం సహకారంలో సీఎంఈలు నిర్వహిస్తున్న అరుదైన, అధునాతన శస్త్ర చికిత్సలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పుడు శస్త్ర చికిత్సల్లో మెళకువలు, అధునాతన విధానాలు, ఇంప్లాంట్స్ వినియోగం వంటి అంశాలపై పీజీలకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం, వారికెంతో ఉపయోగకరం అన్నారు. అనంతరం శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ కార్యాలయ అదనపు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ డి. వెంకటేశ్వరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్‌కుమార్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. వినయ్‌కుమార్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఏ రవిచంద్రమోహన్ పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు
డాక్టర్ డీవీఎల్ నరసింహం
Comments
Please login to add a commentAdd a comment