దొడ్డిదారిన నల్ల చట్టాలు తెస్తున్న కేంద్రం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు, కార్మికులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి ఏలూరు లాకుల మీదుగా అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ధర్నా చౌక్‌లో జరిగిన సభలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించలేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆనాడు రైతు ఉద్యమానికి తలవంచిన ప్రభుత్వం నల్లచట్టాలు విరమించుకున్నట్లు ప్రకటించిందని, తిరిగి దొడ్డిదారిన అవే నల్లచట్టాలను అమలు చేస్తోందని విమర్శించారు. నూతన మార్కెట్ విధానం, సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం వంటివి పూర్తిగా కార్పొరేట్లకు అనుకూల చట్టాలని పేర్కొన్నారు. ఏ లక్ష్యాలు, ఉద్దేశంతో సహకార సంఘాలు ఏర్పాటయ్యాయో ఆ లక్ష్యం నెరవేరకపోగా అసలుకే ఎసరు పెట్టే చట్టాలను తీసుకొచ్చిందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రం నాలుగు లేబర్ కోడ్స్ అమలుకు పూనుకుందని, 29 కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. పనిగంటలు, పని దినాలు పెంచి కార్మికుల శ్రమను, ధనాన్ని దోచుకునే పన్నాగాలు పన్నిందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. రవీంద్ర, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి, ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.యలమందరావు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఎం.వెంకటసుబ్బయ్య, సీఐటీయూ, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment