సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): క్రోధి నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి(శ్రీపంచమి)ని పురస్కరించుకుని ిఫిబ్రవరి 3న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు, సరస్వతి యాగాన్ని నిర్వహించేందుకు వైదిక కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవారి మూలవిరాట్‌ను సరస్వతీదేవిగా అలంకరించడంతో పాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. రానున్న వార్షిక పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, పోటీ పరీక్షలలో మంచి ర్యాంక్ సాధించేలా విద్యార్థులను ఆలయ అర్చకులు ఆశీర్వదిస్తూ అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించిన పెన్ను, కంకణంతో పాటు చిన్న సైజు ఫొటో, కుంకుమ ప్రసాదాలను పంపిణీ చేస్తారు. దేవస్థాన యాగశాలలో సరస్వతి యాగాన్ని నిర్వహించేలా వైదిక కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానాలయం వద్ద ముఖ మండప దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే విద్యార్థులు తప్పని సరిగా యూనిఫాం, స్కూల్, కాలేజీ గుర్తింపు కార్డును ధరించిన వారికి మాత్రమే పెన్నులను అందజేస్తారు.
ఈ నెల 30 నుంచి మాఘ మాసోత్సవాలు
ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు దుర్గమ్మ సన్నిధిలో మాఘ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. మాఘమాసంలో ఆదివారం, ఏకాదశి, దశమి వంటి విశేష పర్వదినాల్లో సూర్యోపాసన సేవ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment