ప్రగతి పథాన రైలు
● విజయవాడ డివిజన్ గణతంత్ర
వేడుకలో డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో 76వ గణతంత్ర వేడుకలు రైల్వే స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ డీఎస్‌సీ (డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్) వల్లేశ్వరతో కలసి ఆర్పీఎఫ్ బలగాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఆర్‌ఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్ సాధించిన పురోగతిని వివరించారు.
రికార్డు స్థాయిలో ప్రయాణికులు..
సరుకు రవాణాలో రూ.3,155 కోట్ల ఆదాయంతో డివిజన్ అత్యుత్తమ పనితీరు నమోదు చేసిందన్నారు. ప్రయాణికులు రికార్డు స్థాయిలో 49.43 మిలియన్ల మంది ప్రయాణించారని, తద్వారా రూ. 1035.21 కోట్ల ఆదాయం అందుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్‌పీఎఫ్ బలగాలు ప్రదర్శించిన ఆయుధ, బైక్ విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో..
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాక్ అండ్ జిల్ స్కూల్, ఈ–వరల్డ్ సెంటర్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వర్షా పాటిల్ డీఆర్‌ఎంతో కలసి ఈ–వరల్డ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం రైల్వే హాస్పిటల్‌లో రోగులకు సందర్శించి పండ్లు, హెల్త్ కిట్‌లను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment