హోమ్‌ ఓటింగ్‌కు 4,000 మంది మొగ్గు | Sakshi
Sakshi News home page

హోమ్‌ ఓటింగ్‌కు 4,000 మంది మొగ్గు

Published Mon, May 6 2024 4:55 AM

హోమ్‌ ఓటింగ్‌కు 4,000 మంది మొగ్గు

భువనేశ్వర్‌: రాష్ట్రంలో ఈనెల 13న జరగనున్న మొదటి దశ జంట ఎన్నికల్లో 4,000 మందికి పైగా ఓటర్లు ఇంటి నుంచి ఓటు (హోమ్‌ ఓటింగ్‌) వేయడానికి మొగ్గు చూపారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ చరిత్రలో తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టడం విశేషం. ఎన్నికల రోజున పోలింగ్‌ బూత్‌కు రాలేని ఓటర్ల కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇంటి ముంగిట ఓటువేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం 85 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వయోవృద్ధ ఓటర్లు, 40 శాతం పైబడి శారీరక వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచి ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. నిబంధన ప్రకారం అటువంటి ఓటర్లు స్థానిక అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే వాహనంలో పోలింగ్‌ బూత్‌కు రావచ్చు లేదా ఇంటి నుంచే ఓటింగ్‌ను ఎంచుకోవచ్చు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒడిశాలో మొదటి దశ ఓటింగ్‌లో మొత్తం 4,158 మంది ఓటర్లు ఇంటి నుంచి ఓటు సౌకర్యం ఎన్నుకున్నారు. వీరిలో 85 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 2,196 మంది వయోవృద్ధ ఓటర్లు, 1,962 మంది 40 శాతం పైబడిన వైకల్యం కలిగిన దివ్యాంగులు ఉన్నారు. తొలి దశలో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలైన కలహండి, నవరంగ్‌పూర్‌, కొరాపుట్‌, బరంపురంలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,158 మంది ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేసేందుకు మొగ్గు చూపారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న ఇంటి నుంచి ఓటు వేయనున్న ఓటర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈవో నికుంజ బిహారీ థొలో అభినందించారు.

Advertisement
Advertisement