ముమ్మరంగా విజిలెన్సు దాడులు
భువనేశ్వర్: రాష్ట్ర విజిలెన్స్ వర్గాలు సోమవారం ముగ్గురు అక్రమ ఆస్తిపరులైన ప్రభుత్వ సిబ్బంది స్థావరాలపై దాడులు చేశాయి. ఢెంకనాల్ కామాక్ష్య నగర్ సబ్ కలెక్టరు నారాయణ చంద్ర నాయక్, ఒడిశా పోలీసు హౌసింగ్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజరు సుబాష్ పండా ఇండ్లపై భువనేశ్వర్, ఢెంకనాల్, బరంపురం, భద్రక్, మయూర్‌భంజ్ ప్రాంతాల్లో 14 వేర్వేరు చోట్ల ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మంది డీఎస్పీలు, 10 మంది ఇనస్పెక్టర్లుతో అనుబంధ సిబ్బంది పాలుపంచుకున్నారు. ప్రత్యేక విజిలెన్సు న్యాయమూర్తులు జారీ చేసిన గాలింపు చర్యల అధికార ఉత్తర్వులతో ఈ దాడులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మరో దాడిలో లంచం తీసుకుంటున్న సీ్త్ర వైద్య నిపుణుడు డాక్టరు అశోక్ కుమార్ దాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన కలహండి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సంయుక్త డైరెక్టరుగా పని చేస్తున్నారు. గర్భిణి చికిత్స కోసం రూ. 6,000 లంచం తీసుకోగా.. అక్కడికక్కడ పట్టుబడ్డాడు.
సబ్ కలెక్టరు అక్రమ ఆస్తులు
ఢెంకనాల్ జిల్లా కామాక్ష్య నగర్ సబ్ కలెక్టరు నారాయణ చంద్ర నాయక్ ఇళ్లలో విజిలెన్స్ వర్గాలు చేపట్టిన సోదాల్లో 4,800 చదరపు అడుగుల విస్తీర్ణపు 3 అంతస్తుల భవనం, 6900 చదరపు అడుగుల విస్తీర్ణపు 3 అంతస్తుల భవనం, 6200 చదరపు అడుగుల విస్తీర్ణపు 2 అంతస్తుల భవనం, 14 ఇళ్ల స్థలాలు, బ్యాంపు పొదుపు ఖాతాల్లో రూ. 34 లక్షల 57 వేలు, నగదు రూ.1 లక్ష 48 వేలు, బంగారం 365 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు.
డీజీఎం సంపన్నుడు
లెక్కాజమ లేని ఆర్జనలతో ఒడిశా పోలీసు హౌసింగు డిప్యూటీ జనరల్ మేనేజరు సుబాష్ పండా తులతూగుతున్నట్లు సోదాల్లో బట్టబయలైంది. ఈ సోదాల్లో లెక్కకు అందని 2 బహుళ అంతస్తు భవనాలు, 1 ఫ్లాటు, 870 గ్రామలు బంగారం, 5 ఇండ్ల స్థలాలు, నగదు రూ. 13 లక్షల 50 వేలు, పొదుపు, పెట్టుబడుల్లో రూ. 1 కోటి 80 లక్షలు ఉన్నట్లు గర్తించారు. సోదాల్లో అక్రమ సొమ్ము లెక్క బయటపడకుండా చేసేందుకు పొరుగింటి డాబాపైకి రూ. 10 లక్షల విలువైన నోట్ల కట్టల్ని విసిరేసినట్లు విజిలెన్సు అధికారుల దృష్టికి రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment