తాగునీటి పరీక్షలు నిర్వహించాలి
పార్వతీపురం: పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విధిగా తాగునీటి పరీక్షలు నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో తాగునీరు, పారిశుద్ధ్యంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండాలని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. తాగునీరు లీకేజి ఎక్కడా ఉండకుండా చూడాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ఇళ్లకు తక్షణం మంజూరు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన మరుగుదొడ్లను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని, మరుగుదొడ్ల వినియోగంపై అధికారులతో పాటు స్వయం సహాయక సంఘాలు కూడా ముందుకు వచ్చి అవగాహన కల్పించాలని కోరారు. విద్యాసంస్థల్లో చేతుల పరిశుభ్రతను చేపట్టి అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఒ. ప్రభాకరరావు మాట్లాడుతూ జిల్లాలో జల్‌జీవన్ మిషన్ కింద రూ.494.53 కోట్లతో 2,859 పనులు మంజూరయ్యాయని ఇంతవరకు రూ.196కోట్లతో 1289 పనులు చేపట్టామని, అందులో 732 పనులు పూర్తయ్యాయని, 557 పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డీపీఓ టి.కొండలరావు, డీఈఓ ఎన్. తిరుపతినాయుడు, భూగర్భ జలాల అధికారి ఎ.రాజశేఖరరెడ్డి, ఇరిగేషన్ ఈఈ ఆర్.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ సూచన
Comments
Please login to add a commentAdd a comment