ప్రాచీన తీరం మొవులియా క్షేత్రం నుంచి శ్రీ జగన్నాథుని కోసం ప్రథమాష్టమి సామగ్రిని సంప్రదాయ మేళతాళాలతో తరలిస్తారు. భొయి సేవకులు ఆధ్యాత్మిక పతాకంతో ముందడుగు వేస్తుండగా ఢొలియా, మొహురియా సేవకులు దారి పొడవునా వాద్య సంగీతంతో ఉర్రూతలూగిస్తారు. వీరి వెంబడి గొడువా సేవకులు పాయికా నృత్య (యుద్ధ విన్యాసాలు) ప్రదర్శనతో అత్యంత ఆనందోత్సాహాలతో శ్రీనీలమాధవుడు సమర్పించిన సామగ్రిని యాత్రగా శ్రీ జగన్నాథుని కోసం తరలిస్తారు. ఈ యాత్ర రెండు విడతల్లో సాగుతుంది. మొవులియా క్షేత్రం నుంచి తొలుత పూరీ శ్రీ గుండిచా మందిరం ప్రాంగణానికి చేరుతుంది. కాసేపటి విరామంతో మలి విడత యాత్రగా శ్రీ మందిరానికి యాత్ర మొదలవుతుంది. పూజా సామగ్రిని శ్రీ మందిరం అధికారిక కార్యాలయంలో జమ చేస్తారు. దేవస్థానం పండితుల సూచన మేరకు శాస్త్రోక్తంగా ఈ సామగ్రిని ప్రధాన దేవాలయానికి తరలిస్తారు. ప్రాచీ తీరం నుంచి మాధవ, చంద్రమౌలి, చారిఛొకొ, గోప్, గణేశ్వరపూర్, నాగపూర్, షోలపూర్, మదరంగ్, ఛొయితొనా, బల్లిఘాయి, బల్లిగువాలి మీదుగా పూరీ గుండిచా మందిరం వరకు యాత్ర సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment