గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చిని గ్రేడింగ్ చేస్తున్న దృశ్యం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా పెరగనుందని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో ధర బాగుండటంతో రైతాంగం మిరప సాగుపై ఎక్కువ దృష్టిపెడుతోంది. గతేడాది దిగుబడి బాగా రావడం, సరాసరి ధర రూ.20 వేల వరకు పలకడంతో రైతులు బాగా లాభపడ్డారు. అదే ఉత్సాహంతో ఈ ఏడాది రైతులు, కౌలు రైతులు పత్తికి బదులు మిర్చి సాగుకు ముందుకు వస్తున్నారు. గతేడాది పల్నాడు జిల్లాలో 57,525 హెక్టార్లలో మిర్చి సాగు జరిగింది. ప్రారంభంలో అధిక వర్షాలు, నల్లతామర పురుగు బెడదతో పంట దెబ్బతింది. పెట్టుబడులు పెరిగినా పంటను కాపాడుకున్న రైతులకు కొంత మెరుగైన దిగుబడులు రావడంతోపాటు ధర కూడా బాగా పలికి మేలుచేసింది. ఈ ఏడాది 77,644 హెక్టార్లలో మిర్చి సాగు ఉంటుందని ఉద్యానవనశాఖ అధికారలు అంచనావేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొదలవ్వడంతో రైతులు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, పిడుగరాళ్ల వంటి చోట్ల మిరప సాగు మొదలైంది.
ఆర్బీకేలలో విత్తనాలు
మిర్చి రైతులకు విత్తనాల కొరత, నకిలీల బాధ లేకుండా ఆర్బీకేల్లోనే అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు ప్రైవేట్ మార్కెట్‌లోనూ గిరాకీకి అనుగుణంగా మిర్చి విత్తనాలు అందేలా ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాకు 20 కంపెనీలకు చెందిన 2,647 కిలోల విత్తనాలు అవసరమని ఉద్యానవనశాఖ వ్యవసాయశాఖకు ఇండెంట్ పంపింది. జిల్లాలో ఆర్మూర్, జీనీ 2626, తేజా సిగ్మెంట్స్ రకాల విత్తనాలకు బాగా డిమాండ్ ఉంది.
కౌలుకు గిరాకీ..
ఈ ఏడాది రైతులు అధిక సంఖ్యలో మిరపసాగుకు సన్నద్ధమవుతుండడంతో కౌలు భూములకు గిరాకీ పెరిగింది. దేవుడి మాన్యాలు, స్థానికేతురుల భూములను సాగుచేయడానికి కౌలు రైతులు పెద్దసంఖ్యలో ముందుకు వస్తున్నారు. గతేడాది పిడుగురాళ్ల మండలంలో రూ.15 వేల నుంచి 18 వేలు ఉన్న కౌలు, ఈఏడాది రూ.25 వేల 30 వేల వరకు పలకడం గమనార్హం. మరోవైపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలురైతులకు సీసీఆర్ కార్డులు విరివిగా జారీ చేసి, రుణసదుపాయం కల్పించడంతో వారు సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈఏడాది జిల్లాలో 55 వేల సీసీఆర్ కార్డుల మంజూరు లక్ష్యం కాగా ఇప్పటికే 25,828 కార్డులను అధికారుల జారీ చేశారు.
అందుబాటులో విత్తనాలు
మిర్చికి మంచి ధర పలకడం, పత్తి పంటకు వస్తున్న తెగుళ్ల నేపథ్యంలో ఈ ఏడాది మిరప సాగు అధికంగా ఉంటుందని అంచనా వేశాం. ఖరీఫ్‌లో 77,644 హెక్టార్లలో సాగు జరుగుతుందని అంచనా. అందుకు అనుగుణంగా జిల్లాకు 2,647.10 కిలోల మిర్చి విత్తనాలు అవసరమని ఇండెంట్ పంపాం. ఆర్బీకేల ద్వారా కూడా రైతులకు మిరప విత్తనాలు అందుబాటులో ఉంచాం. బయట మార్కెట్‌లోనూ డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాల లభ్యత ఉంది.
– బీజే బెన్నీ, పల్నాడు జిల్లా ఉద్యానవనశాఖ అధికారి
పది ఎకరాల్లో సాగుకు సిద్ధం
మిర్చి ధర ఆశాజనకంగా ఉండటంతో గతేడాది ఆరు ఎకరాలు సాగు చేసి లాభాలు పొందా. ఆ ఉత్సాహంతో ఈ ఏడాది పది ఎకరాల్లో సాగు చేసేందుకు సన్నద్ధమయ్యా. విత్తనాలకు బాగా గిరాకీ ఉంది.
– నంద్యాల శివారెడ్డి, కామేపల్లి, పిడుగురాళ్ల మండలం
ధర బాగుంది
నాకు 20 ఎకరాల పొలం, ఐదు బోరుబావులు ఉన్నాయి. పత్తి పంటను రెండు నెలల కింద సాగు చేయగా దానికి తెగులు సోకి పంటను తీసేయాల్సి వచ్చింది. మరోవైపు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది మిరపసాగు ఎక్కువ చేయాలని నిర్ణయించుకున్నా. నర్సరీ నుంచి మిరప నారు తీసుకువచ్చి నాటుకోవడానికి భూమిని సిద్ధం చేశాను.
– చింతా రామయ్య, రైతు, రాచమళ్లపాడు గ్రామం, వెల్దుర్తి మండలం
భారీగా పెరగనున్న సేద్యం పల్నాడులో జిల్లాలో రైతుల అమితాసక్తి మార్కెట్‌లో విత్తనాలకు గిరాకీ ఆర్బీకేల్లోనూ విక్రయిస్తున్న ప్రభుత్వం పత్తిలో నష్టాలతో మిరప వైపు రైతుల మొగ్గు
పల్నాడు జిల్లాలో
మిర్చి సాగు ఇలా(హెక్టార్లలో)..
గతేడాది : 57,525
ఈ ఏడాది అంచనా : 77,644
విత్తనాలు అవసరం (కిలోల్లో) : 2,647
Comments
Please login to add a commentAdd a comment