అపరాల సాగు రైతులకు అవగాహన
తాడేపల్లిరూరల్: దుగ్గిరాల మండలం గొడవర్రులో అపరాలు సాగు చేస్తున్న రైతులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ అధికారి ఎం.అనూరాధ, జిల్లా వ్యవసాయ కార్యాలయ అధికారి ఎన్.శ్రీవాణి విచ్చేసి అపరాలు సాగుచేయడంలో సమస్యలను వివరించారు. అపరాలు విస్తీర్ణం పెంచడంపై రైతులకు అవగాహన కల్పించారు. అపరాలు సాగుచేయడం వలన భూసారం పెరుగుతుందని, రైతులు అవసరం మేరకే పురుగు మందులు వాడాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారిణి పి.శిరీష, ఏఈవో రమేష్, వీఎఎ పవన్, రైతులు, ఎంపీటీసీ శివకుమార్ పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై జిల్లా, మండలస్థాయి అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో రెండు రోజులపాటు నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈసందర్భంగా పల్నాడు జిల్లా పరిధిలోని 28 మండలాలకు చెందిన అధికారులకు, గ్రామ పంచాయతీల కార్యదర్శులకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తొమ్మిది సూత్రాల ఆధారిత అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఏపీ పంచాయతీ రాజ్–గ్రామీణాభివృద్ధి సంస్థ జేడీ ఆర్.కేశవరెడ్డి, పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ భాస్కరరెడ్డి సమన్వయంతో జరిగిన శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ కె.మోహనరావు, ఏపీఎం జవన్, డీపీఎం డి. రవీంద్రబాబు, బి.దయాసాగర్, డీపీఆర్సీ జిల్లా సమన్వయకర్త ఎస్.పద్మరాణి, కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు గుంటూరు, బాపట్ల జిల్లాలకు..
గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై జెడ్పీ సమావేశ మందిరంలో గురు, శుక్రవారాల్లో గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన అధికారులకు శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment