అంబడిపూడిపూడి ఇసుక రీచ్ నిర్వాహకులకు ఓ దినపత్రిక క్రైం రిపోర్టర్ బెదిరింపు
అచ్చంపేట: ‘ఇసుక రీచ్‌లలో నేను చెప్పింది చేయండి.. లేకుంటే మీ రీచ్ ఏవిధంగా నిర్వహిస్తారో నేనూ చూస్తానంటూ ఓ దినపత్రికలో పనిచేస్తున్న క్రైం రిపోర్టర్, అతని అనుచరుడు బెదిరించి, రీచ్ నిర్వహణకు అంతరాయం కలించారంటూ అంబడిపూడి–1 ఇసుక రీచ్ సూపర్‌వైజర్ యడ్లపల్లి బుచ్చిబాబు సోమవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. ఈనెల 22న ఏపీ07 టీజే0678 అనే నంబరు గల లారీని కోనూరు గ్రామానికి చెందిన ఆటో శ్రీను కుమారుడు సురేష్ వేగంగా నడుపుకుంటూ రీచ్ వద్దకు వచ్చాడు. ‘మా లారీ ఓనర్ నాకు ఉచితంగా ఇసుక లోడ్ చేయమన్నాడు, చేస్తావా లేదా’ అని బెదిరించాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధర చెల్లిస్తే లోడ్ చేస్తానని సుపర్‌వైజర్ బుచ్చిబాబు చెప్పడంతో ధర చెల్లించాడు. కొద్దిసేపటి తరువాత లారీ తీసుకుని వచ్చి ‘మా ఓనర్ నాకు ఉచితంగా ఇసుకను పోయమన్నాడు. నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలి’ అని అడిగాడు. అలా కుదరదని చెప్పడంతో సురేష్ ఘర్షణకు దిగాడు. లారీని దారికి అడ్డంగా పెట్టి మిగిలిన లారీలు, ట్రాక్టర్ల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. ఇంతలో సురేష్ మా ఓనర్‌తో మాట్లాడాలని ఫోను బుచ్చిబాబుకు ఇచ్చాడు. అవతలి వ్యక్తి ‘నేను క్రైమ్ రిపోర్టర్‌ను.. పల్నాడు జిల్లాలో నేను చెప్పినట్లుగా రీచ్ నిర్వాహకులు నడుచుకోవాలి, మీరు ఏవిధంగా రీచ్‌ని కొనసాగిస్తారో చూస్తా’ అంటూ బెదిరించాడు. ఈ మేరకు సూపర్‌వైజర్ బుచ్చిబాబు ఫిర్యాదు మేరకు సీఐ వెంకటప్రసాద్ రిపోర్టర్, లారీ డ్రైవర్‌లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment