వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి
నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారి బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ హుమాయిస్‌బాష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైల్వేస్టేషన్ గేటు వద్ద నుంచి కలెక్టరేట్ వరకు వలంటీర్లతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం జేసీ సూరజ్ గనోరేకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.60 లక్షల మంది వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులతో విజయవాడలో మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు సేవచేయటమే వలంటీర్లు చేసిన నేరమా అని ప్రశ్నించారు. మంత్రి డోలా వీరాంజనేయులు శాసన మండలిలో చేసిన ప్రకటన మోసపూరితమని ఖండించారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకోకుంటే వారే భవిష్యత్తులో ప్రభుత్వానికి ఉరితాళ్లుగా మారతారని హెచ్చరించారు. వలంటీర్లకు మద్దతు పలికిన సోషల్ యాక్టివిస్ట్, ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ల సంఘ రాష్ట్ర గౌరవ సలహాదారు ఈదర గోపీచంద్ మాట్లాడుతూ ‘ఓటిచ్చునప్పుడే ఉండాలి బుద్ధి’ అని ప్రముఖ ప్రజాకవి కాళోజి ప్రబోధించినట్లే చంద్రబాబు లాంటి రాజకీయ వేత్తలు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేటప్పుడే బాధ్యత–భయం గుర్తెరగాలని అన్నారు. గెలిచి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల మేనిఫెస్టోను చూస్తేనే తనకు భయమేస్తోంది అనే మోసపూరిత మాటలు మాట్లాడటం దగాకోరు తనమని విమర్శించారు. కార్యక్రమంలో వలంటీర్లు ఎల్.సురేష్, షేక్ యాసిన్, షేక్ గౌస్, మాలతి, మధుబాల, షాబీరా, ఉమామహేశ్వరి, సుబ్బారావు, పెదలక్ష్మయ్య పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా జేసీకి వినతిపత్రం
Comments
Please login to add a commentAdd a comment