యానిమేటర్లపై కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

యానిమేటర్లపై కక్ష సాధింపు

Published Tue, Nov 26 2024 1:58 AM | Last Updated on Tue, Nov 26 2024 1:58 AM

యానిమేటర్లపై కక్ష సాధింపు

యానిమేటర్లపై కక్ష సాధింపు

అమరావతి: కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు సేవలందించే యానిమేటర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఇష్టారాజ్యంగా తొలగింపులకు పూనుకుంటోంది. ఇప్పటివరకు పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో ఉన్న యానిమేటర్లను ఓ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయంటూ తొలగించారు. పల్నాడు జిల్లాలో సుమారు వెయ్యిమందికిపైగా యానిమేటర్లు 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వీరు ప్రభుత్వం ఇచ్చే అతితక్కువ వేతనంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పుడు ఏదో సాకుతో విధుల్లో నుంచి తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో డ్వాక్రా గ్రూపుల మహిళలకు తీర్మానాలు చేయటం, రికార్డు రాయటం, అలాగే ఖాతా పుస్తకాలు అనుసరించి సంఘాల రికార్డులలో ఎప్పటిప్పుడు నమోదు చేయటం యానిమేటర్ల విధి. సంఘ సభ్యులకు మండల వెలుగు కార్యాలయానికి అనుసంధానంగా వీరు పనిచేస్తారు. రుణాల మంజూరులో కీలకంగా వ్యవహరిస్తారు. వీరిని నియమించే అధికారం, తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. గ్రామంలోని సుమారు 20 నుంచి 30 గ్రూపులలోని మహిళలంతా కలిసి తమకు అనుకూలంగా ఉన్న అదే గ్రామానికి చెందిన మహిళను యానిమేటర్‌గా నియమించుకుంటారు. ఇదే పద్ధతిన తొలగిస్తారు. ఇప్పుడు కూట మి ప్రభుత్వం తమకు అనుకూలంకాని యానిమేటర్లపై కక్షగట్టి తమ పార్టీ అనుకూల సంఘాలతో సమావేశం పెట్టి తొలగింపులకు పాల్పడుతోంది. అదేమని అడిగితే అవినీతిని అంటగడుతున్నారు. ఎక్కడైనా ఒకరిద్దరు యానిమేటర్లు గ్రూపుల ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడితే ఆ నెపం అందరిపైనా వేస్తున్నారు.

కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినా..

పెదకూరపాడు నియోజవకర్గంలో తొలగింపులు అధికంగా ఉండడంతో యానిమేటర్లు కోర్టును అశ్రయించారు. ఈ నియోజవర్గంలో ఐదు మండలాలు ఉండగా 181 మంది యానిమేటర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదు నెలల కాలంలో 94 మందిని తొలగించినట్లు సమాచారం. అందులో 52 మంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు గ్రామ సమైక్య సంఘాల కార్యక్రలాపాలలో డీఆర్డీఏ అధికారులు జోక్యం చేసుకోరాదని, యానిమేటర్లను గతంలో ఉన్న విధంగా యథాస్థితిగా కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. అయినా అధికారుల్లో మార్పురాలేదు. దీంతో యానిమేటర్లు సీపీఎం అనుబంధ సంస్థ సీఐటీయూతో కలిసి ఆందోళన బాటపట్టారు. ఇటీవల పల్పాడు కలెక్టరేట్‌ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు.

అధికారం లేకపోయినా తొలగింపులు కొద్దిమంది అవినీతిని అందరికీ అంటగట్టి దురాగతం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు కోర్టును అశ్రయించిన యానిమేటర్లు నిరసన బాటలో చిరుద్యోగులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement