అన్నపూర్ణ దేవిగా కోటదుర్గమ్మ
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ వారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అన్నపూర్ణ్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి భక్తులు సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఒక్క దరఖాస్తు రాలేదు..!
పాలకొండ రూరల్: పాలకొండ నియోజకవర్గ పరిధిలో నూతన మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి పాలకొండ ఎక్స్‌సైజ్ శాఖ పరిధిలో స్వీకరించిన దరఖాస్తులపై సబ్ కలెక్టర్ సి.యశ్వంత్‌రెడ్డి శనివారం ఆరా తీశారు. ఎకై ్సజ్ కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడి అధికారులతో చర్చించారు. నియోజకవర్గ పరిధిలో జనాభా ప్రాతిపదికన నాలుగు మండలాలకు 11 దుకాణాలను ప్రభుత్వం కేటాయించిందని, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై మూడు రోజులు గడిచినా ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అధికారులు వివరించారు.
నాన్నా నేను ఇంటికి వస్తున్నా అంటూ అనంతలోకాలకు...
పాలకొండ రూరల్: నాన్నా.. నేను ఇంటికి వస్తున్నా.. మరికొద్ది సేపటిలో కత్తిపూడి కూడలి నుంచి బయలుదేరుతున్నా అంటూ శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ చేసిన కుమార్తె రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలు వెళ్లిపోయింది. ఈ వార్త విన్న ఆ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకు చెందిన గెంబలి శ్రీనివాసరావు, నాగమణి దంపతుల కుమార్తె పద్మావతి(18) కాకినాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల పిలుపు మేరకు దసరా పండడకు ఇంటికి బయలుదేరింది. కత్తిపూడి మీదుగా బస్సులో వస్తానని తండ్రికి ఫోన్‌లో సమాచారం అందించింది. పద్మావతి బస్టాప్‌కు బైక్‌పై వస్తుండగా గోల్లప్రోలు హైవేపై ఐచర్ వ్యాన్ ఢీ కొనడంతో తల భాగంలో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలన్న ఆ తండ్రి ఆశను మరో వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఛిదిమేసింది. కన్న కూతురు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లికి కడుపుకోత మిగిలింది. చెల్లెలు మరణవార్త విని అన్నయ్య సంజీవి గుండెలు బాదుకున్నాడు. ఈ ఘటనలో వాహనంపై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కూడా మరణించారు. ఈ వార్త పట్టణంలో విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని స్వగృహానికి చేర్చేందుకు బంధువులు గొల్లప్రోలు పయనమయ్యారు.
గోగు ఊరవేతలో రైతులు బిజీ
గరుగుబిల్లి: గోగు ఊరవేత పనుల్లో మండల రైతులు బిజీ అయ్యారు. పెద్దూరు, గరుగుబిల్లి, గొట్టివలస, ఉల్లిబద్ర తదితర గ్రామాల్లో సుమారు 350 ఎకరాల్లో రైతులు గోగు పంటను సాగుచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటను కోసి చెరువుల్లో ఊరవేస్తున్నారు. అయితే, గోగు పంటను కోసేందుకు ఎకరాకు రూ.4వేల నుంచి రూ.4,500 పెట్టుబడి అవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఊరవేతకు చెరువుల్లో సమృద్ధిగా నీరు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment