బోగస్ ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలపై విచారణ
సీతంపేట: బోగస్ ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలపై ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి తన చాంబర్‌లో సోమవారం విచారణ చేసి 5 కేసులను పరిశీలించారు. ఫిర్యాదుదారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరువర్గాల వద్ద ఉన్న ఆధారాలను తనిఖీ చేశారు. అనంతరం విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు. కార్యక్రమంలో డీడీ అన్నదొర, సూపరెంటెండెంట్ దేశ్ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియనివ్యక్తి మృతి
జామి: మండలకేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ విషయంపై పోలీసులు అందించిన వివరాల ప్రకారం భిక్షాటన చేస్తూ తిరుగుతుండే వ్యక్తి భీమసింగి గ్రామంలో ఆదివారం అనారోగ్యంతో పడి ఉండడంతో స్థానికులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతదేహాన్ని విజయనగరం మార్చురీలో ఉంచారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా జామి పోలీస్‌స్టేషన్‌లో సమచారం అందించాలని ఎస్సై వీరజనార్దన్ తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
చీపురుపల్లి: పట్టణంలోని జగన్నాథరాజు కాలనీ వినాయక టవర్స్‌లో నివాసం ఉంటున్న టి.నాగమణి(33) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపారు. మృతురాలి భర్త ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సోమవారం ఇంట్లో అందరూ ఉండగానే క్షణికావేశంలో నాగమణి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. మృతురాలికి భర్త ప్రసాద్, బాబు నయాన్ష్, పాప గీతాన్ష్ ఉన్నారు.
చికిత్స పొందుతూ
యువకుడి మృతి
విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందులూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనపై వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోటీపరీక్షలకు ప్రిపేరవుతూ తన చిన్నాన్న ఇంటిలో ఉంటూ చదువుకుంటున్న పెనుమజ్జి అనిల్ కుమార్ (30) ఈ నెల 17న మధ్యాహ్నం బైక్‌పై మార్కెట్‌కు వెళ్తుండగా అయ్యన్నపేట జంక్షన్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద వెనుక నుంచి నిర్లక్ష్యంగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్ తలకు తీవ్రగాయమైంది. స్థానికులు 108 సాయంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుని చిన్నాన్న పెనుమజ్జి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ చోరీ
భోగాపురం: మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న స్టేట్ బ్యాంకు–2 ప్రాంతానికి చెందిన ఆర్ ఉమాదేవి భర్త సొంత పనుల నిమిత్తం ఈనెల 15వ తేదీన పల్సర్ బైక్‌పై బయటకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఉమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పాపారావు తెలిపారు.
బైక్ చోరీపై కేసు నమోదు
వంగర: మండల పరిధిలోని శివ్వాం గ్రామంలో ఏనుగుతల వెంకటనాయుడికి చెందిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని ఎస్సై షేక్ శంకర్ సోమవారం తెలిపారు. వెంకటనాయుడు తన రేకుల షెడ్డులో ఆదివారం రాత్రి పార్కింగ్ చేసిన బైక్ సోమవారం ఉదయం చూసేసరికి లేకపోవడంతో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పోక్సో కేసు నమోదు
విజయనగరం క్రైమ్: మండల పరిధిలోని జమ్మునారాయణపురంలో ఏడేళ్ల బాలికపై సోమవారం లైంగికదాడి జరిగింది. దీనికి సంబంధించి విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఒంటరిగా ఉన్న ఏడేళ్ల బాలికపై కన్నేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హుటాహుటిన డీఎస్పీతో పాటు దిశ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment