ఏకాగ్రతతోనే లక్ష్యాల సాధన
విజయనగరం అర్బన్: ఏకాగ్రతతోనే లక్ష్యాల సాధన సాధ్యమని విజయనగరం కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురజాడ అప్పారావు బీసీ స్టడీ సర్కిల్ బీసీ అభ్యర్థులకు అందిస్తున్న డీఎస్సీ ఉచిత శిక్షణను కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఉన్నత విద్య పూర్తిచేసిన యువత జీవితంలో ఉన్నత లక్ష్యాల సాధనపై గురిపెట్టాలన్నారు. ఢిల్లీలో సివిల్స్ శిక్షణకు మన రాష్ట్రం నుంచి వేలాది మంది అభ్యర్థులు వెళ్తున్నా శిక్షణపై ఏకాగ్రత చూపకపోవడడంతో పరీక్షలో విఫలమవుతున్నారని చెప్పారు. ఉపాధ్యాయ నియామక రాత పరీక్షకు సన్నద్ధమవుతూనే జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలపై దృష్టిపెట్టాలన్నారు. పోటీ పరీక్షలను ఎదుర్కోవడంలో తన అనుభవాలను వివరించారు. పరీక్షలో విజేతలుగా నిలిచేందుకు అవసరమైన మెలకువలు తెలియజేశారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి పెంటోజీ మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 182 మందికి రెండునెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఒక్కో అభ్యర్థికి రూ.వెయ్యి విలువచేసే స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు నెలకు రూ.1,500 స్టైఫండ్‌గా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమాధికారి యశోదరావు పాల్గొన్నారు.
బీసీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ప్రారంభోత్సవంలో కలెక్టర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment