108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొర్లి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005వ సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 108 అంబులెన్సు వ్యవస్థ దేశంలోని అత్యున్నతమైన ప్రజాసేవగా గుర్తింపు పొందిందన్నారు. అలాంటి వ్యవస్థను ప్రభుత్వం నేరుగా నిర్వహించకుండా ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పగించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థల లాభాపేక్ష వల్ల సర్వీసుల నాణ్యత పోతోందని ఆవేదన వెలిబుచ్చారు. అంబెలెన్సుల్లో పనిచేస్తున్న చేస్తున్న కార్మికులు ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ సదుపాయాలు గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదని వాపోయారు.
వాహనాలు ఫిట్‌నెస్ లేకపోవడంతో ప్రమాదాలు
108 వాహనాలు ఫిట్‌నెస్ లేకపోవడం వలన ప్రమాదాలకు గురై అనేకమంది ఉద్యోగులు మరణిస్తున్నారని, వారికి ఎలాంటి పరిహారం ప్రభుత్వం గాని, యాజమాన్యం గాని చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పనిదినం అమలు చేయాలని, ప్రావిడెంట్ ఫండ్ యాజమాన్య వాటా యాజమాన్యం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటిపై ఇప్పటికే అనేక దఫాలుగా ప్రభుత్వ అధికారులు, మంత్రులకు విన్నవించుకున్నామని, అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదని ఇప్పటికై నా 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని, లేనట్లయితే ఈనెల 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దావాల రమణారావు, వై.మన్మథరావు, జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, 108 ఉద్యోగుల సంఘం నాయకులు తెర్లి వెంకటరమణ, తెంటు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షల
ప్రారంభం
ఈనెల 25 నుంచి సమ్మె
స్పష్టం చేసిన ఉద్యోగుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment