విజేతలకు కలెక్టర్ అభినందన
విజయనగరం అర్బన్: అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన జిల్లా స్థాయిలో పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలను కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ అభినందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ సంయుక్తంగా బాలికా సంరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ సోమవారం తన చాంబర్‌లో నగదు బహుమతులు అందజేశారు. ఒక్కో విభాగంలో ప్రథమ బహుమతి విజేతకు రూ.5 వేలు, ద్వితీయ బహుమతి విజేతకు రూ.3 వేలు, తృతీయ బహుమతి విజేతకు రూ.2 వేలు వంతున నగదు బహుమతులు అందజేశారు. వక్తృత్వం పోటీల్లో వి.లతాశ్రీ (బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల, కొత్తవలస), టి.లావణ్య (జెడ్‌పీహెచ్ వంగర), ఎం.రమ్య (కేజీబీవీ, గుర్ల) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వ్యాసరచన పోటీల్లో పి.పరిమళ (ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చీపురుపల్లి), పి.ప్రత్యూశ్రీ (ఏపీమోడల్ స్కూల్, షికారుగంజి), పి.భాగ్యశ్రీ (జెడ్పీ హైస్కూల్, కొట్యాడ), చిత్ర లేఖనంలో ఎం.గౌతమ్ (జెడ్పీ హైస్కూల్, దేవాడ) జి.జ్యోతి (కేజీబీవీ, గుర్ల), జి.మేఘన (బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల, కొత్తవలస) వరుసగా మూడుస్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో డీఈఓ మాణిక్యం నాయుడు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment