అంకితభావంతో పని చేయండి : జేసీ
సాలూరు: ఉద్యోగులు నిబద్దతతో పని చేయాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ శోభిక అన్నారు. పట్టణంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సర్వీసులు ,శాఖాపరంగా జరుగుతున్న పనులపై ఆరా తీసారు. అనంతరం పట్టణంలో జీసీసీ గోదాంను పరిశీలించారు. సక్రమంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మండలంలో శివరాంపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖి చేసారు. ట్రక్ షీట్, రికార్డులు పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ వెంకటరమణ, ఏఓ అనురాధ, వీఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి
● జిల్లా ప్రోగ్రాం అధికారి జగన్‌మోహన్‌రావు
పార్వతీపురం టౌన్: ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియలో భాగంగా పార్వతీపురంలో అభయ క్లినిక్ – డయాగ్నోస్టిక్స్, వందన ఆస్పత్రులను వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్‌మోహన్‌రావు వైద్య బృందంతో కలసి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు అమలు చేస్తున్నారో.. ప్రతీ విభాగాన్ని పరిశీలించారు. రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ, వైద్య పరికరాల పనితీరు, ఆస్పత్రుల ఆవరణలో పరిశుభ్రత, రోగుల చికిత్స నిమిత్తం అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన మొదలగు అంశాలన్నిటిపై తనిఖీ చేశారు. రిసెప్షన్ వద్ద రోగుల వివరాలు స్పష్టంగా పూర్తిగా నమోదు చేయాలన్నారు. వివిధ పరీక్షలు, తనిఖీల రుసుము(ఫీజు) వివరాలు తప్పనిసరిగా ఆస్పత్రిలో ప్రదర్శించాలన్నారు. బయోమెడికల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ ఏ విధంగా అమలు చేస్తున్నారో ఆరా తీశారు. చేతుల పరిశుభ్రత తప్పనిసరి అని ఆదేశించారు. అగ్నిమాపక రక్షణ పరికరాల నిర్వహణ, వినియోగించే నైపుణ్యంపై సిబ్బంది అందరికీ అవగాహన కల్పించాలన్నారు.
నోటిఫైడ్ వ్యాధుల వివరాలు పోర్టల్‌లో నమోదు తప్పనిసరి
నోటిఫైడ్ వ్యాధులు మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, కుక్క కాటు, పాము కాటు వివరాలు నిర్దేశించిన హెచ్‌ఐఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు, సలహాలు తెలియజేసే పోస్టర్లను ఆస్పత్రిలో ప్రదర్శించాలన్నారు. ప్రసవ గదిలో పరికరాలు, స్టెరిలైజేషన్ నిర్వహణ, రేడియంట్ వార్మర్ పనితీరు పరిశీలించారు. శస్త్ర చికిత్సలు నిర్వహించే సమయంలో అనస్థీషియా వైద్యులు తప్పనిసరిగా ఉండాలన్నారు. వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బంది నైపుణ్యత ప్రతిభను పరీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment