108 అంబులెన్స్ సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలి
● ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్
పార్వతీపురం టౌన్: 108 అంబులెన్స్ సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ డిమాండ్ చేసారు. పార్వతీపురం గిరిజన సామాజిక భవనంలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడుజి కిషోర్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2005వ సంవత్సరం నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న 108 వ్యవస్థ నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వలన అంబులెన్స్ సేవల్లో నాణ్యత కొరవడిందన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, అంబులెన్స్‌లు అత్యవసర పరిస్థితులలో సకాలంలో చేరుకోక అనేకమంది అత్యవసర వైద్య సేవలు అందక మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన 108 వ్యవస్థలో కార్పొరేట్ శక్తులు ప్రవేశించి తమ లాభాలను పెంచుకునేందుకు ఈ అంబులెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 108 వ్యవస్థలో పని చేస్తున్న 3,500 మంది సిబ్బందికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం లేదని, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 108 వ్యవస్థలో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు గుంట్రెడ్డి రవికుమార్, జి.శ్రీనివాసరావు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, సంచాన ఉమామహేశ్వరరావు, పి.సంఘం, మన్మధరావు, బంకురు సూరిబాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి.రమేష్, 104 ఉద్యోగ సంఘం నాయకుడు జి దుర్గారావు, చెరువుల పరిరక్షణ సమితి నాయకులు వంగల దాలినాయుడు, 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొర్లి అప్పలనాయుడు, కార్యదర్శి తెర్లి వెంకటరమణ, తెంటు రాంబాబు, ఆవాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment