‘బాల వివాహ ముక్త్ భారత్’ను సక్సెస్ చేయాలి : కలెక్టర్
పార్వతీపురం: బాల వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బాల వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నవంబర్ 27న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌న్‌లో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి ప్రారంభిస్తారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు, అవగాహన కల్పించేందుకు బాల వివాహ ముక్త్ భారత్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన వివరించారు. ‘యావత్తు ప్రభుత్వం’ ‘యావత్తు సమాజం’ నినాదంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. బాల్య వివాహాలు జరగకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. బాల్య వివాహాలు మానవ హక్కుల ఉల్లంఘనలో అత్యంత దారుణమైన రూపాలలో ఒకటిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నిర్దేశించిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన ఆటంకంగా ఉందనే భావన ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహాల నిషేధ నియమాలు–2023 ప్రకారం జిల్లా, డివిజనల్, ప్రాజెక్ట్ స్థాయిలో బాల్య వివాహాల నిషేధ అధికారులను నియమిస్తూ నోటిఫై చేసిన మేరకు మండల, గ్రామ, మున్సిపల్ స్థాయిలలోను నియమించడం జరుగుతుందని చెప్పారు. కలెక్టర్ జిల్లా బాల్య వివాహాల నివారణ అధికారిగా వ్యవహరిస్తారని, డివిజనల్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ /సబ్–కలెక్టర్, ప్రాజెక్ట్ స్థాయిలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, మున్సిపాలిటీలు, మునిసిపల్ కమిషనర్లకు, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంఈఓలు, పంచాయతీరాజ్ శాఖ, ఎంపీడీఓలు, సూపర్‌వైజర్లు తదితరులు బాల్య వివాహాల నివారణ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. జువైనెల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం, 2015 నిబంధనల ప్రకారం నియమించిన చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ వారి సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికార పరిధిలో బాల్య వివాహాల నివారణ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థల నుంచి ఎన్నికై న ప్రతినిధులు, సామాజిక, పౌర సంస్థలు, బార్ కౌన్సిల్ సభ్యులు, లీగల్ సర్వీసెస్ అథారిటీలలో సభ్యులుగా ఉన్న స్థానిక న్యాయవాదులు, ఎన్‌జీఓలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment