ఏడాది కష్టం ఆహుతి
శృంగవరపుకోట: ఆరుగాలం కష్టపడిన రైతన్నల కష్టం అగ్గిపాలైంది. రైతులు ధాన్యపు సిరులను దాచుకున్న పురులను అగ్నిదేవుడు స్వాహా చేశాడు. శృంగవరపు కోట మండలంలోని ఽమామిడిపల్లి గ్రామానికి చెందిన కిలారి శ్రీను, కిలారి కుమార్, ఈశ్వరరావు, అప్పలనాయుడు, సన్నిబాబు, కాసులమ్మ, ఈశ్వరమ్మ, భవానీలు నూర్పు చేసి, గ్రామానికి సమీపంలో ఉన్న తమ కళ్లాల్లో ఽ పురులు కట్టి ధాన్యం నిల్వ చేశారు. కాగా సోమవారం అర్ధరాత్రి 1గంట సమయంలో ధాన్యం పురులకు నిప్పు అంటుకుని మంటలు ఎగిశాయి. దారిన పోతున్న వారు మంటలు చూసి మామిడిపల్లి గ్రామం వద్దకు వెళ్లి కేకలు వేసి గ్రామస్తులను లేపి విషయం చెప్పారు. దీంతో గ్రామానికి చెందిన రైతులు వెంటనే అగ్నిమాపకశాఖకు ఫోన్ చేసి కళ్లానికి పరుగులు తీసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పురుల్లో ఉన్న ధాన్యం కాలిపోయాయి. ఒక్కో ధాన్యం పురిలో 30 నుంచి 40 బస్తాల ధాన్యం ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. సుమారు రూ 4.లక్షల మేర ఆస్తినష్టం సంభవించిందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా మామిడిపల్లి గ్రామంలో జరిగిన దుర్ఘటనలో ఎంత మేర పంటనష్టం వాటిల్లిందని మంగళవారం సాయంత్రం మండల వ్యవసాయాధికారి రవీంద్రను వివరణ కోరగా స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని, గడ్డిమోపు కాలినట్లు ఏఈఓ అప్పలనాయుడు చెప్పారు.
8 మంది రైతుల ధాన్యం దగ్ధం
రూ.4లక్షల మేర ఆస్తినష్టం
Comments
Please login to add a commentAdd a comment