![అధికార హుకుం..!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/26/25vzg16-370049_mr-1737852966-0.jpg.webp?itok=19QOc4qo)
అధికార హుకుం..!
● అధికార పార్టీ నేతల దందా..
● రైతులతో రాజకీయం
● కూటమి నేతలు చెబితేనే డ్రోన్‌లు ఇస్తారట..!
● జిల్లాకు 25 డ్రోన్లు మంజూరు
● సార్ నేను డ్రోన్ కోసం దరఖాస్తు చేసాను. ఎప్పుడు ఇస్తారని ఓ రైతు సంబంధిత వ్యవసాయ అధికారిని అడిగాడు. సదరు అధికారి అఽధికార పార్టీకి చెందిన నేతతో ఓ మాట చెప్పించండి.. మీకు డ్రోన్ మంజూరు అయిపోతుందని చెప్పినట్టు తెలిసింది. అంతేకాకుండా డ్రోన్‌కు రాయితీ ఎక్కువగా ఇస్తున్నందున అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే ఇవ్వాలని ఉన్నత అధికారుల నుంచి మాకు ఆదేశాలు వచ్చాయని రైతుతో అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయంలో సాగు కోసం డ్రోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు అధికారుల నుంచి ఎదురవుతున్న అనుభవాలు కూటమి నేతల అధికార పెత్తనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందరికీ అన్నం పెట్టే రైతన్నతోనూ కూటమి నేతలు రాజకీయం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా కూటమి నేతలు చెప్పినట్టు వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలను ప్రసన్నం చేసుకుంటేనే డ్రోన్లు ఇస్తామని అధికారులు ఖరాఖండిగా చెబుతుండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
జిల్లాకు 25 డ్రోన్‌లు మంంజూరు
జిల్లాకు 25 డ్రోన్లు మంజూరయ్యాయి. జిల్లాలో 27 మండలాలు ఉన్నప్పటికీ 25 మాత్రమే మంజూరయ్యాయి. వీటి కోసం కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారు కూటమి పార్టీకి వారికి చెందిన వారా.. లేదా ఇతర పార్టీలకు చెందిన వారా.. అని అధికార పార్టీ నేతలు వాకబు చేస్తున్నారు. ప్రతిప్రక్ష పార్టీకి చెందిన వారు అయితే వారికి డ్రోన్ నిలిపివేయాలని సంబంధిత వ్యవసాయ అధికారులకు అధికార పార్టీ నేతల నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది.
80 శాతం రాయితీ
ఒక్కో డ్రోన్‌కు 80 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నారు. డ్రోన్ విలువ రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు వరకు ఉంది. ఇందులో ప్రభుత్వం రూ.8 లక్షల వరకు రాయితీ ఇస్తుంది. మిగతాది రైతు భరించాల్సి ఉంటుంది. రాయితీ ఎక్కువగా ఇస్తున్నాం.. కాబట్ది ఆ లబ్ధి కూడా కూటమికి చెందిన కార్యకర్తలే లబ్ధి పొందాలని కూటమి సర్కార్ యోచిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇవ్వాలని ఆదేశాలు
జిల్లాకు మంజూరైన డ్రోన్‌లను అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోను ఆ విధంగా చేయాలని ఆదేశాలు వచ్చినట్టు సర్వత్రా చర్చ జరుగుతుంది. అధికార పార్టీ అండగాని, అధికార పార్టీకి చెందిన కార్యకర్త అయితే తప్ప డ్రోన్ మంజూరు కాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రజాప్రతినిధుల సూచనలు కూడా తీసుకుంటున్నాం..
జిల్లాకు 25 డ్రోన్లు మంజూరయ్యాయి. డ్రోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పడు డ్రోన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా.. లేదా.. అని అడుగుతున్నాం. డ్రోన్‌లు మంజూరులో ప్రజాప్రతినిధుల సూచనలు కూడా తీసుకుంటున్నాం.
– వి.తారకరామరావు,
జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment