విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉండాలి
కోల్ సిటీ(రామగుండం): వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) కాలేజీలో గురువారం నిర్వహించిన వైట్ కోట్ సెర్మానీలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైద్యులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిర్దేశించుకున్న లక్ష్యాలను వైట్ కోట్ సెర్మనీ గుర్తు చేస్తుందన్నారు. మూడేళ్లుగా సిమ్స్ కాలేజీలో ఉన్నత సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య కళాశాలగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రాబోయే నాలుగైదు ఏళ్లలో మెడికోల జీవితం చాలా కీలకం కాబోతుందని, ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మకం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. రెండున్నరేళ్లుగా చూపించిన ధైర్యం భవిష్యత్‌లోనూ కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మెడికోలకు వైట్ కోట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెడికోలతో కాలేజీ ప్రిన్సిపాల్ హిమబిందు సింగ్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీ పాల్గొన్నారు.
ఇంటింటి సర్వేకు సహకరించాలి
మంథని: ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. గురువారం ఆరెందలో కుటుంబసర్వేను పరిశీలించి జెడ్పీ ఉన్నత పాఠవాలను తనిఖీ చేశారు. అనంతరం అడవి సోమనపల్లిలోని సర్వే నం.192లో కొకొకోలా కంపెనీ స్థాపనకు గుర్తించిన 80 ఎకరాల స్థలాన్ని కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో కూడిన సమాచారం అందించాలని తెలిపారు. కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేశ్, తహసీల్దార్ రాజయ్య,తో పాటు తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు
పెద్దపల్లిరూరల్: రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేందుకు వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు, సమస్యలు ఉంటే కాల్ సెంటర్ సెల్ నం.7995050781 కు ఫిర్యాదు చేస్తే సత్వర పరిష్కారం చూపుతారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, గన్నీసంచులు, రవాణాపరమైన ఇబ్బందులు, సమస్యలపై సమాచారం అందించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష
మెడికోలకు దిశానిర్దేశం
Comments
Please login to add a commentAdd a comment