సింగరేణిలో అంతర్గత రోడ్లకు మహర్దశ
గోదావరిఖని: సింగరేణి కార్మిక వాడలు అందంగా ముస్తాబు కానున్నాయి. అంతర్గత రోడ్లకు యాజమాన్యం నిధులు మంజూరు చేయడంతో పదేళ్ల కార్మికుల కష్టాలకు తెరపడనుంది. ఆర్జీ–1 ఏరియాలోని 9జోన్లలో ఉన్న అంతర్గత రోడ్లను తారు రోడ్లుగా ఆధునికీకరించనున్నారు. రూ.5కోట్ల నిధులు ఇప్పటికే మంజూరు కాగా, టెండర్ దశ పూర్తి చేసుకుని త్వరలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ఆర్జీ–1 ఏరియాలో..
సింగరేణి సంస్థలోనే అతిపెద్ద ఏరియాగా ఉన్న ఆర్జీ–1 ఏరియాకు ప్రత్యేక స్థానం ఉంది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం తర్వాత గోదావరిఖని ప్రాంతంలో అత్యధిక కార్మిక కుటుంబాలు నివాసముంటున్నాయి. 7,100 క్వార్టర్లతో సుమారు 30వేల మంది కార్మిక కుటుంబాలతో పాటు మరో 20వేల మందికి పైగా కుటుంబాలు అనధికారిక నివాసాల్లో ఉంటున్నాయి. పదేళ్ల క్రితం నిర్మించిన అంతర్గత రోడ్లకు మరమ్మతులు లేకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. ఈక్రమంలో కార్మిక వాడల్లో రోడ్లను ఆధునికీకరించేందకు యాజమాన్యం నిర్ణయించింది. ఇటీవల గోదావరిఖని ప్రాంత పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, సీఅండ్‌ఎండీ ఎన్ బలరాం అధికారికంగా ప్రారంభించారు. బడ్జెట్ కేటాయింపు పూర్తి కావడంతో టెండర్ ప్రక్రియకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం టెండర్లు పూర్తి చేసుకుని మరో రెండు వారాల్లో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శిలాఫలకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
ఆగస్టు నెలలో గోదావరిఖని ప్రాంత పర్యటనకు వచ్చిన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్.బలరాం ఈ పనులు ప్రారంభించారు. త్వరలోనే రోడ్లను ఆధునికీకరిస్తామని ప్రకటించారు.
23 కిలోమీటర్లు.. రూ.5కోట్లు
సింగరేణి యాజమాన్యం కార్మికులు, అధికారుల క్వార్టర్లలో ఉన్న అంతర్గత రోడ్లను ఆధునికీకరించేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా రూ.5కోట్ల నిధులతో కార్మిక వాడల్లో దెబ్బతిన్న 23కిలోమీటర్ల రోడ్లను ఆధునిక తారురోడ్లుగా తీర్చిదిద్దనున్నారు. బంగ్లాస్ ఏరియా, ఉదయ్‌నగర్‌కాలనీ, పవర్‌హౌజ్‌కాలనీ, జీఎంకాలనీ, గాంధీనగర్, హనుమాన్‌నగర్, జవహర్‌నగర్, విఠల్‌నగర్, తిలక్‌నగర్ తదితర ఏరియాల్లో పాడైపోయిన తారు రోడ్ల స్థానంలో నూతన రోడ్లు ఏర్పాటు చేయనున్నారు.
రూ.5కోట్లతో 23కిలోమీటర్ల
తారు రోడ్లకు గ్రీన్‌సిగ్నల్
పదేళ్ల తర్వాత రోడ్లకు ప్రత్యేక నిధులు
ఆర్జీ–1 ఏరియా : 9జోన్లు
కార్మిక క్వార్టర్లు : 7,100
జనాభా : 30వేలు
నివాసముంటున్న కార్మికులు : ఆర్జీ–2, 3, ఏపీఏ శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాల్‌పల్లి
కార్మికుల సంక్షేమమే ధ్యేయం
కార్మిక కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా యాజమాన్యం ముందుకు సాగుతోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లను ఆధునీకరించాం. రూ.5కోట్లతో 23కిలోమీటర్ల మేర రోడ్లను ఆధునీరించబోతున్నాం. టెండర్ పక్రియ పూర్తి చేసుకుని త్వరలో ఆవార్డు కాబోతోంది. మరో రెండు వారాల్లో పనులు ప్రారంభిస్తాం.
– డి.లలిత్‌కుమార్, ఆర్జీ–1 జీఎం
Comments
Please login to add a commentAdd a comment