గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకో అవకాశం ఇచ్చారు. అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని మరోసారి ఆయన నోటీసులు జారీ చేశారు. అయితే.. నోటీసుల్లో ఇదే తుది విచారణగా పేర్కొనడం గమనార్హం.
వైఎస్సార్‌సీపీ నుంచి నెగ్గి.. పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలకు ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ..
అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో 19వ తేదీన మధ్యాహ్నాం విచారణ ఉంటుందని.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం ఉంటుందని నోటీసుల్లో అసెంబ్లీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. అనర్హత పిటిషన్ వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం.
మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ లకు సైతం శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకు హాజరయ్యే విషయమై వీళ్లంతా నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment