సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో అటు అధికార బీజేపీ, ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. 2024 ఎన్నికల్లో కేంద్రంలోని మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా దేశంలోని ప్రతిపక్షాలు పావులు కదుపుతున్న వేళ.. అధికార బీజేపీ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.
ఓవైపు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రధాన విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.ఎన్నికల కార్యచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్రపక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తొలుత బిహార్‌లోని పాట్నాలో మెగా విపక్షాల భేటీ నిర్వహించగా.. తాజాగా 26 ప్రతిపక్షాలు బెంగుళూరు వేదికగా రెండ్రోజులు(సోమవారం, మంగళవారం) సమావేశం కానున్నాయి.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం మిత్ర పక్షాలతో కలిసి బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే కూటమి(నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) భేటీ కానుంది. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరు కానున్నాయని బీజేపీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే పరిధి క్రమంగా పెరుగుతోందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ పథకాలు, విధానాలపై ప్రజల్లో సానుకూల ప్రభావం ఉందని, ఇది తమలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోందన్నారు.
చదవండి: బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ.. లైవ్ అప్‌డేట్స్..
ఇక ఎన్డీయే సమావేశానికి ఇప్పటికే ఉన్న మిత్ర పక్షాలతోపాటు కొత్తగా చేరిన పార్టీలు సైతం హాజరుకానున్నాయి. ఎన్డీయే మీటింగ్‌కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు సైతం హాజరు కానున్నారు. అజిత్ పవార్‌తో కలిసి ఎన్డీయే భేటీకి వెళ్లనున్నట్లు ప్రఫుట్ పటేల్ పేర్కొన్నారు. వీరితోపాటు బిహార్‌లోనూ మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ ఓబీసీ నాయకుడు దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు కూడా ఎన్డీయే సమావేశానికి ఆహ్వానం అందించింది.
ఇదిలా ఉండగా సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్ భర్ ఎన్డీయేలో చేరుతున్నట్లు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని ఓబీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఎస్‌బీఎస్పీ.. 2019లో ఎన్డీయే నుంచి వైదొలొగింది. తిరిగి మళ్లీ సొంత గూటికి చేరుతుంది.
చదవండి: మరోసారి శరద్ పవార్‌ను కలిసిన అజిత్ పవార్..
Comments
Please login to add a commentAdd a comment