మరో ఔరంగజేబులా హరీశ్‌: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy Speech Gurukula Teachers Appointment Letters Program | Sakshi
Sakshi News home page

మరో ఔరంగజేబులా హరీశ్‌: సీఎం రేవంత్‌రెడ్డి

Published Thu, Feb 15 2024 6:47 PM | Last Updated on Thu, Feb 15 2024 8:25 PM

CM Revanth Reddy Speech Gurukula Teachers Appointment Letters Program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌, హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్‌కు కాళ్ల నొప్పులొస్తాయని ఎద్దేవా చేశారు. నల్గొండకు వెళ్లడానికి మాత్రం ఎలాంటి నొప్పులు  ఉండవని మండిప‍డ్డారు.  సీఎం రేవంత్‌రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేసే కార్యక్రమంతో పాల్గొని మాట్లాడారు. హరీశ్‌కు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాల్సిందేనని అన్నారు. పదేళ్లు చేసిందేమీ లేదు.. మేము రాగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు.

‘ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్ నిర్లక్ష్యం వహించింది. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. 30లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించాం.త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నాం. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీశ్‌ అంటుండు. హరీశ్‌రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. పదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్‌ ఏం చేశారు?. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు. దశ బాగుంటే దిశతో పని లేదు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలి.

...3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?. మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా?. మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరు. బీఆరెస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న  6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే ఒకే గొడుకు కిందకు తీసుకోస్తాం. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కొడంగల్‌లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఈ మోడల్‌ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement