సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార నగారా మోగించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు తాము అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు చేసే మేలు గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించింది.
ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న గాంధీ ఐడియాలజీ సెంటర్ వేదికగా ప్రచార షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
గడప గడపకూ చేరేలా..
ఈసారి ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలన్న ఆశతో ముందుకెళుతున్న కాంగ్రెస్ 100 రోజు ల ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించనుంది. బీఆర్‌ఎస్ సర్కారు తొమ్మిదేళ్ల పాలనలో చేయలేని పనులను ఎత్తిచూపుతూ కరపత్రాలు ప్రచురించి, వాటి ని రాష్ట్రంలోని గడపకూ చేర్చి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని శనివారం ప్రకటించనుంది.
దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్నర్ మీటింగ్‌లకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గతంలో ప్రతిపాదించిన విధంగా సీనియర్ నేతల బస్సుయాత్ర షెడ్యూల్‌ను కూడా ప్రకటించే అవ కాశం ఉందని సమాచారం. ఇక సెపె్టంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్న కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టో కోసం ఇప్పటికే ప్రకటించిన కొన్ని ప్రధానాంశాలతో పోస్టర్లు రూపొందించి రాష్ట్రమంతటా వేయాలనే ఆలోచనలో ఉంది. మొత్తమ్మీద కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి అవసరమైన అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ శనివారం నాటి షె డ్యూల్ ప్రకటన ఉంటుందని టీపీసీసీ నేతలు చెప్తున్నారు.
దీనిపై టీపీసీసీ సీనియర్ నేత మల్లురవి ‘సాక్షి’తో మాట్లాడారు. బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కాంగ్రెస్ ఏమేం చేస్తుందన్నది ప్రజలకు వివరిస్తామని.. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని శనివారం ప్రారంభించనున్నామని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకటన అనంతరం కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment