
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మాణిక్‌రావ్ ఠాక్రే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కలసికట్టుగా ముందుకెళ్లాలని, అంతా ఐక్యంగా ఉన్నామని ప్రజలకు తెలియజెప్పేందుకు రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేపట్టాలని టీపీసీసీ కీలక నేతలు నిర్ణయించారు. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో చర్చించాకే నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.
కోమటిరెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కో–చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్య నేతలు ఎం.కోదండరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, బి.మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు ఈ లంచ్ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రాష్ట్ర పార్టీలోని అంతర్గత పరిణామాలపై చర్చించారు.
దూకుడుగా వెళ్లాల్సిందే..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్, బీజేపీలపై రాజకీయ దాడులు చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన సఫలీకృతం అవుతున్నామని.. ఇక మీద ఈ దూకుడు మరింత పెంచాలని భేటీలో నేతలు నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా నేతలంతా కలసి పనిచేస్తున్నారన్న భావన కలిగించాలని, ఇందుకోసం ఐక్యంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. యాత్రలో ఎవరెవరు పాల్గొనాలి? ఎప్పట్నుంచి ఎప్పటి వరకు, ఏ రూట్లో యాత్ర నిర్వహించాలన్న దానిపై ఈనెల 22న లేదా 23న పీఏసీ సమావేశం నిర్వహించి ఖరారు చేయాలని అభిప్రాయానికి వచ్చారు.
అన్ని నియోజకవర్గాల్లో సర్వే..
ఎన్నికల కోసం అభ్యర్థుల ఖరారు అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేయించాలని నేతలు నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలు, అభ్యర్థుల బలాబలాలతోపాటు ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గం ఎంత మేర ప్రభావం చూపుతుందన్న అంశాలపై పక్కా అవగాహనకు వచ్చేలా సర్వే ఉండాలని.. త్వరగా దానిని ప్రారంభించాలని తీర్మానించారు.
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ హామీలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా ప్రచారం చేయాలని.. ప్రధానమైన అంశాలను ఎంచుకుని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అభిప్రాయానికి వచ్చారు. ఇక కొత్తగా పార్టీ చేరే వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యే టికెట్లపై ఆశలు పెట్టుకుని వస్తున్నారని.. బేషరతుగా పార్టీలో చేరాలనుకున్న వారికే అవకాశం ఇవ్వాలని, ఎన్నికల సమయంలో సమర్థులకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు.
మరోవైపు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరే సందర్భంగా చేపట్టే బహిరంగసభ కోసం ఈనెల 30వ తేదీలోపు తేదీని ఖరారు చేసేలా ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలని, ప్రియాంకా గాంధీ సమయం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఠాక్రే, రేవంత్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి బీసీని సీఎం అభ్యర్థి ప్రకటిస్తారా?
– ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
– బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ మాత్రమేనని వ్యాఖ్య
రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని, బీసీల గురించి తమకు బీఆర్‌ఎస్ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీని పీసీసీ చీఫ్ చేసిందని, బీఆర్‌ఎస్‌కు దమ్ముంటే బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ చేశారు. బుధవారం తన నివాసంలో కీలక నేతలతో భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు.
మంత్రి తలసాని విమర్శలకు రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారే తప్ప బీసీలను కించపర్చేలా మాట్లాడలేదని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని చాటేందుకే ఈ భేటీ నిర్వహించామని చెప్పారు. మీటింగ్‌లో చర్చించిన అంశాలన్నీ బయటికి వెల్లడిస్తే నాలుగు నెలల తర్వాత ఖాళీ కావాల్సిన ప్రగతిభవన్ ఇప్పుడే ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment