సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్‌తో సోమవారం తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ‘రైతు గోస’కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, జాతీయ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, అన్ని జిల్లాల కిసాన్ సెల్ అధ్యక్షులు పాల్గొన్నారు.
పలు గ్రామాలకు చెందిన రైతులు, బాధితులు హాజరై తమ సమస్యను, ఆవేదనను వివరించారు. ధరణితో భూమి హక్కుల సమస్య తలెత్తిన నిజమైన హక్కుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, వర్షాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం ఇవ్వాలని.. దళితులు భూములను లాక్కోవడం ఆపేయాలని, తీసుకున్న భూములను 15 రోజుల్లో తిరిగి ఇవ్వాలని కార్యక్రమంలో తీర్మానించారు.
రైతులను నట్టేట ముంచిన సర్కారు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచిందని, దేశంలో పంటల బీమా పథకం లేని రాష్ట్రం ఒక్క తెలంగాణనేనని అన్వేశ్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు భూములిస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కుని పెద్ద కంపెనీలకు అమ్ముతోందని, రైతులను బజారున పడేస్తుందని ధ్వజమెత్తారు.
ధరణి వచ్చాక లక్షలాది మందికి భూమి హక్కులు రాలేదన్నారు. భూసర్వే జరగకుండా భూమి హక్కుల సమస్య పరిష్కారం కాబోదని స్పష్టం చేశారు. ఇప్పటికీ 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ రైతులకు సమస్యలు వచ్చినా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అన్ని మండలాల్లో కిసాన్ కాంగ్రెస్ నిర్మాణంతో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment