![Former Minister Malla Reddy Comments On Alliances - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/16/mallareddy12_0.jpg.webp?itok=Dqhi-iTD)
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో BRS పార్టీకి పొత్తు ఉంటుందంటూ బాంబు పేల్చారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న BJP, BRS లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి మల్లారెడ్డి ఆ మాటలు చెప్పాడా? లేక లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అన్నది వచ్చే కొద్ది రోజుల్లో తెలుస్తుంది.
మల్లారెడ్డి ఏమన్నాడంటే..
"బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేద" అన్నారు మల్లారెడ్డి
మల్కాజి గిరి లోక్‌సభ సీటు గురించి మాట్లాడుతూ.. "మా మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్ భద్రంగా వుంది, బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మాదే. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. నా కొడుకుకు టిక్కెట్ ఇస్తే మాదంతా ఉమ్మడి కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మా యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు వుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే నేను ఏం చేయలేను" అన్నాడు మల్లారెడ్డి.
మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ?
ఇవ్వాళ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
"బీఆర్‌ఎస్‌తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్‌ఎస్‌ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment