కాంగ్రెస్‌ పాలనలో హనుమాన్‌ చాలీసా విన్నా నేరమే | Hanuman Chalisa is Crime Under Congress Rule Says PM Modi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో హనుమాన్‌ చాలీసా విన్నా నేరమే

Published Wed, Apr 24 2024 3:17 AM | Last Updated on Wed, Apr 24 2024 3:17 AM

Hanuman Chalisa is Crime Under Congress Rule Says PM Modi - Sakshi

ప్రజలు సొంత మత విశ్వాసాలు పాటించడం కష్టం  

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ హయాంలో శ్రీరామనవమి వేడుకలపై ఆంక్షలు  

మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యం  

దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లను తీసుకొచ్చే కుట్రలు ఫలించలేదు  

బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్‌ సిద్ధాంతం  

రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ ఆశయాలను కాంగ్రెస్‌ ఏనాడూ గౌరవించలేదు  

నేను రాజ్యాంగానికి విధేయుడిని.. అంబేడ్కర్‌ను ఆరాధిస్తున్నా.. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టికరణ  

రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం  

జైపూర్‌/రాయ్‌పూర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనలో ప్రజలు వారి మత విశ్వాసాలు పాటించడం చాలా కష్టమని, కనీసం హునుమాన్‌ చాలీసా వినడం కూడా పెద్ద నేరం అవుతుందని అన్నారు. మంగళవారం రాజస్తాన్‌లోని టోంక్, ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి, ధామ్‌తారీ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో ఇటీవల హనుమాన్‌ చాలీసా వింటున్న ఓ దుకాణదారుడిని దారుణంగా కొట్టారని గుర్తుచేశారు.

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరారని చెప్పారు. రాళ్లు విసిరినవారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి రక్షణ కల్పించారని, రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలపై ఆంక్షలు విధించారని మండిపడ్డారు. రాజస్తాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల మత విశ్వాసాలను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా హనుమాన్‌ చాలీసా పఠించవచ్చని, శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవచ్చని, ఇది బీజేపీ గ్యారంటీ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. 

రిజర్వేషన్లపై ఇదే నా గ్యారంటీ   
‘‘మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యం. 2004లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో కోత విధించి, ముస్లింలకు కట్టబెట్టే పనికి శ్రీకారం చుట్టింది. 2004 నుంచి 2010 దాకా ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసేందుకు నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచింది. కానీ, చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కాంగ్రెస్‌ ఉద్దేశం నెరవేరలేదు. 2011లో దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ సాగించిన కుట్రలు ఫలించలేదు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొట్టి, మరో వర్గానికి ప్రయోజనం కల్పించాలని చూశారు. భారత రాజ్యాంగాన్ని, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను కాంగ్రెస్‌ ఏనాడూ గౌరవించలేదు. దళితులు, వెనుకబడిన గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లను విభజించి, ముస్లింలకు ఇచ్చేస్తామని బహిరంగంగా ప్రకటించే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల నుంచి దొంగిలించి, ముస్లింలకు ఇచ్చిన కోటాను బీజేపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది.

రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల గడువు 2020లో ముగిసిపోగా, మేము మరో పదేళ్లు పొడిగించాం. దళితులకు, వెనుకబడిన గిరిజనులకు రిజర్వేషన్లు ఎప్పటికీ అంతం కాబోవని నేను గ్యారంటీ ఇస్తున్నా. మతం పేరిట ఎవరైనా రిజర్వేషన్లను విభజించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. రాజ్యాంగానికి విధేయుడిగా నడుచుకుంటున్నా. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను ఆరాధిస్తున్నా’’   

నక్సలిజం, మావోయిజాన్ని అంతం చేస్తాం  
‘‘ఛత్తీస్‌గఢ్‌లో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి హింసను ప్రోత్సహించింది. కాంగ్రెస్‌కు, అభివృద్ధికి పొత్తు పొసగదు. అవి రెండూ కలిసి ముందుకు సాగలేవు. కాంగ్రెస్‌ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి, హింస పెరిగిపోతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నక్సలైట్ల హింసాకాండ విపరీతంగా పెరిగింది. హింసాకాండలో ఒకవైపు జనం మరణిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు జేబులు నింపుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, మావోయిస్టు హింసాకాండ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నక్సలిజాన్ని, మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు’’

కాంగ్రెస్‌ వస్తే ప్రజల సొమ్ముపై ఎక్స్‌–రే  
‘‘దేశంలో వనరులపై మొదటి హక్కు మైనార్టీలకే ఉందని కాంగ్రెస్‌ పాలనలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఇది యాదృచ్చికం కాదు. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్‌ సిద్ధాంతం. ప్రజల ఆస్తులను, కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకొని, కొందరు ఎంపిక చేసిన వ్యక్తులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతోంది. కాంగ్రెస్‌తోపాటు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలను బయటపెడుతున్నందుకే ఆ పార్టీ నాయకులు నన్ను దూషిస్తున్నారు. నిజం మాట్లాడితే వారు భయపడుతున్నారు.

వారి రహస్య ఎజెండాలను బహిర్గతం చేస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను నమ్ముకుంది. అందుకే రాజ్యాంగాన్ని కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులను, సొమ్ములను ఎక్స్‌–రే తీస్తామని కాంగ్రెస్‌ యువరాజు చెబుతున్నారు. అంటే ప్రజలు తమ దగ్గరున్న డబ్బులు, బంగారాన్ని పెట్టెలో దాచి, గోడల్లో రహస్యంగా భద్రపరిచినా కాంగ్రెస్‌ నాయకులు ఎక్స్‌–రే ద్వారా కనిపెట్టి, స్వాధీనం చేసుకుంటారు. తర్వాత ఎంపిక చేసిన వ్యక్తులకు ఆ సొమ్ము పంపిణీ చేస్తారు. కాంగ్రెస్‌ చెబుతున్న సంపద పునఃపంపిణీ వెనుక ఉన్న అసలైన అర్థం ఇదే’’  

దేశాన్ని విభజించే కుతంత్రమే  
‘‘కాంగ్రెస్‌ పార్టీ మన దేశాన్ని మతం పేరిట ముక్కలు చేసింది. స్వాతంత్య్రం వచ్చాక మొదటిరోజు నుంచే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల ప్రజలు అధికారంలో భాగస్వాములు కావడాన్ని ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోంది. మరో నాటకానికి తెరతీసింది. దేశాన్ని విభిజించే కుట్రలకు పాల్పడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా మార్చాలని ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎంపీ డిమాండ్‌ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరు గోవాలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయొద్దని అంటున్నారు.

ఇది ముమ్మాటికీ దేశాన్ని విభజించే కుతంత్రమే. రాజ్యాంగాన్ని అమలు చేయొద్దనడం రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించినట్లు కాదా? తమపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయతి్నస్తున్నారంటూ గతంలో జమ్మూకశ్మీర్‌లో కొందరు వ్యక్తులు గగ్గోలు పెడుతుండేవారు. మీరు(ప్రజలు) బీజేపీని ఆదరించాక ఆ వ్యక్తుల నోళ్లు మూతపడ్డాయి. జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం కాంగ్రెస్‌ను తిరస్కరించింది. అందుకే దేశాన్ని చిన్నచిన్న దేశాలుగా, దీవులుగా విడగొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.

కాంగ్రెస్‌ నేడు గోవాలో రాజ్యాంగం అమలును అంగీకరించడం లేదు. రేపు దేశమంతటా అమలు చేయొద్దని చెప్పడం ఖాయం. దేశ అభివృద్ధి పట్ల కాంగ్రెస్‌కు ఒక విజన్‌ లేదు. పేదల సంక్షేమం గురించి ఆ పార్టీకి ఏబీసీడీ కూడా తెలియదు. ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ కాంగ్రెస్‌ అసత్య ప్రచారం చేస్తోంది. బీజేపీ సంగతి పక్కన పెట్టండి. సాక్షాత్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దిగొచ్చినా సరే రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు’’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement