రాజకీయాల్లో కొన్ని సార్లు త్యాగాలు చేయక తప్పదు. అన్ని సార్లూ అనుకున్నట్లుగా జరగదు. మునుగోడు ఉప ఎన్నిక గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కష్టాలు తెచ్చిపెడుతోందట. వామపక్షాలతో పొత్తు కంటిన్యూ అయితే కొన్ని సిటింగ్ సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితి గులాబీ పార్టీకి ఏర్పడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే ఈ సీటు పోతే పోయింది.. మరో సీటు అడుగుదాం అనుకుంటున్నారట.
లైన్‌లో జూలకంటి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈసారి గులాబీ పార్టీ పోటీ చేస్తుందా లేక పొత్తులో భాగంగా సీపీఎంకు సీటు కేటాయిస్తుందా అనే చర్చ మొదలైంది. సీపీఎం, బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరితే జిల్లాలో మిర్యాలగూడ స్థానాన్ని తమకు ఖచ్చితంగా కోరే అవకాశం ఉంది. ఇప్పటికి ఐదు సార్లు సీపీఎం అక్కడ విజయం సాధించింది. పార్టీకి బలమైన కేడర్ కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి మంచి అనుచర గణం ఉంది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ సీటు తీసుకుని జూలకంటిని బరిలో దించాలని సీపీఎం నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీపీఎం ప్రణాళికలు ఎలా ఉన్నా మిర్యాలగూడ టికెట్ వదులుకుంటే సిటింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.
నీళ్లు వదులుకున్నారా?
అవసరం అయితే తన స్థానాన్ని వదులుకుంటానని సిటింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు ముందే ప్రకటించేశారు. దీంతో ఈ సీటు సీపీఎంకు కేటాయించడం వల్ల బీఆర్ఎస్‌లో ఎలాంటి తల నొప్పులు రావని పార్టీ నాయకత్వానికి కూడా స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కరరావుకు నియోజకవర్గంలో పరిస్థితి ఏమంతా బాగాలేదని టాక్ వినిపిస్తోంది. అందుకే సీపీఎంకు ఇవ్వొద్దని గట్టిగా అడిగితే జరిగే నష్టాన్ని అయన ముందే గ్రహించారు.
అందుకే పొత్తు కుదిరితే తన సీటు ఇచ్చేసినా పర్లేదని ముందే ప్రకటించారు. ఆ విధంగా పార్టీ బాస్ దృష్టిలో పడొచ్చని ఆయన భావించారు. గతంలో ఓ సభలో మాట్లాడుతూ.. ఇప్పటికీ మిర్యాలగూడ ప్రజలు జూలకంటి రంగారెడ్డినే ఎమ్మెల్యేగా భావిస్తున్నారని వ్యాఖ్యానించడాన్ని బట్టి భాస్కర్ రావు సీటు వదులుకునేందుకు ఎప్పుడో మానసికంగా సిద్ధమయ్యారని అర్థం అవుతోంది.
త్యాగం చేస్తా.. సాగర్ ఇవ్వండి
సీటు విషయంలో పేచీ పెట్టకుండా వదులుకోవడం ద్వారా.. నాగార్జున సాగర్ అడుగుదామని ఆయన అనుకుంటున్నట్లు టాక్. సాగర్ నియోజకవర్గంలో సెటిలర్స్ అధికంగా ఉండటంతో ఎప్పటి నుంచో సాగర్ పై భాస్కర్ రావు కన్నేశారు. అయితే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి భగత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరో నియోజకవర్గం నేతకు పార్టీ నాయకత్వం అవకాశం కల్పిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment