
సాక్షి, ఢిల్లీ: గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన వరంగల్ విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళసై నివేదిక కోరగా, ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ ఘటనపై ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘ప్రవల్లికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య. సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దీనిపై స్పందించాలి. తెలంగాణ యువత సీఎం కేసీఆర్‌ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు.