చిరంజీవిపై గరికపాటి ఫైర్‌.. వారు చెప్పే శాంతి వచనాలకు విలువెక్కడిది? | Kommineni Srinivasa Rao Satirical Story On Garikipati Narasimha Rao | Sakshi
Sakshi News home page

Kommineni Srinivasa Rao: చిరంజీవిపై గరికపాటి ఫైర్‌.. వారు చెప్పే శాంతి వచనాలకు విలువెక్కడిది?

Published Tue, Oct 11 2022 8:13 PM | Last Updated on Tue, Oct 11 2022 8:52 PM

Kommineni Srinivasa Rao Satirical Story On Garikipati Narasimha Rao - Sakshi

రాజకీయ నాయకులు, ఆద్యాత్మిక వేత్తలు, భక్తి విషయాలకు రాజకీయ అంశాలకు ముడిపెట్టి మాట్లాడడం పద్దతేనా? ఇలాంటివాటివల్ల ప్రజలకు ఏమైనా మంచి సందేశం వెళుతుందా? ఆలయానికి వెళ్లి ప్రార్ధన చేసి, ఏవో కోర్కెలు కోరుకుని వెళ్లిపోవడం రివాజు. కాని రాజకీయ నేతలు దేశం కోసమే ప్రార్ధించామని చెబుతుంటారు. నిజంగా వారు అచ్చం ప్రజల కోసమే పూజలు చేసి ఉంటే మెచ్చుకోవలసిందే. కానీ ఎక్కువ మంది తమ అదికారం కోసమో, మరే రాజకీయ ప్రయోజనం కోసమో చేస్తుంటారు. అదేమి రహస్యం కాదు. అది తప్పుకూడా కాదు. కానీ బయటకు వచ్చి చెప్పే కబుర్లే ఒక్కోసారి అనవసర వివాదాలకు తావిస్తుంటాయి. 

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దసరా నాడు విజయవాడ కనకదుర్గమ్మ గుడిని సందర్శించుకుని పూజలాచరించిన తర్వాత అమరావతి రాజధాని విషయమై మాట్లాడిన సంగతులలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే తగులుతాయన్న భావన కలుగుతుంది. అలాగే ప్రముఖ ఆద్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్య ఒకటి ఆయనలోని పరిజ్ఞానాన్ని ప్రశ్నించేలా ఉంది. ముందుగా చంద్రబాబు ఏమన్నారో చూద్దాం. మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదని  అన్నారు. 

ప్రజా సంకల్పం, దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి రాజధానిగా నిర్ణయించాం. ప్రస్తుతం రాజధాని అమరావతిపై రోజుకోమాట మార్చడం మంచిదికాదు.. అలాంటి వాళ్లను దుర్గమ్మ కూడా క్షమించదు .. అంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రాజధానికి సంబంధించి తన వైఖరిపై రాజకీయంగా ఏమి మాట్లాడినా చంద్రబాబును ఆక్షేపించనవసరం లేదు. కాని దుర్గమ్మ తల్లికి లింక్ పెట్టి మాట్లాడడమే అభ్యంతరకరం. మాట తప్పేవారిని దుర్గమ్మ క్షమించదని అంటే, అందువల్లే ఆయన 2019 ఎన్నికలలో ఘోర ఓటమి పాలయ్యారా? రాజధాని 29 గ్రామాల పరిధిలోనే ఉండాలని, రాష్ట్ర ప్రజలందరి సొత్తు తీసుకువచ్చి ఆ గ్రామాలలోనే పెట్టాలని దుర్గమ్మ ఏమైనా చెప్పారా? 
(చదవండి: గరికపాటిపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు, నువ్వేంటో..!)

చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ బదులు ఇస్తూ, దుర్గమ్మ అన్ని ప్రాంతాల ప్రజల మేలు కాంక్షిస్తారని అన్నారు. చంద్రబాబును 23 సీట్లకే పరిమితం చేసి జగన్ కు 151 సీట్లను దుర్గమ్మ ఇచ్చినట్లే కదా? అసలు మాట తప్పడం అంటే ఏమిటి? లక్షకోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడం మాట తప్పినట్లు అవుతుందా? లేదా? కాపులను బిసిలలో చేర్చుతామని చెప్పి చేయలేకపోవడం మాట తప్పడం అవుతుందా? 400 ఎన్నికల హామీలను ఇచ్చి అమలు చేయకపోవడాన్ని ఏమంటారు. రాజకీయ నేతలు ఇలాంటి విషయాలలో సెంటిమెంట్ జోడించి ప్రసంగాలు చేస్తే అవి వారికే తగులుతాయన్న సంగతి అర్ధం చేసుకోవాలి.

ఇక గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యను గమనిద్దాం. ఏడు కొండలని రెండు కొండలు చేస్తే ఏమైందో చూశాం కదా అని అన్నారు. ఇది ఫక్తు రాజకీయ విమర్శ. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై రాజకీయంగా కుట్ర చేయడానికి అప్పట్లో కొందరు ఈ దుష్ప్రచారం చేశారు. నిజానికి స్థానిక ఎన్నికల వల్ల పవిత్రత దెబ్బతినకూడదని ఆనాటి ప్రభుత్వం కొంత విస్తీర్ణం పేర్కొంది. పైగా అది కూడా గత ప్రభుత్వాల టైమ్ నుంచి ఉన్నదే. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మీడియా వ్యక్తి, ఆర్ఎస్ఎస్ కు చెందిన కొందరు దీనిని వివాదం చేసి వైఎస్ కు పులమడానికి యత్నం చేశారు. 

తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించడమే కాకుండా, తిరుమల అంటే ఏడు కొండలేనని వైఎస్ జిఓలు కూడా ఇచ్చారు. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా గరికపాటి అభ్యంతరకరంగా మాట్లాడారు. కేవలం ఏదో వ్యక్తిగత ద్వేషం పెట్టుకుని మాట్లాడారేమో అనిపిస్తుంది. పైగా అలయ్ బలయ్ వంటి ప్రోగ్రాంలో ఈ ప్రస్తావనే అవసరం లేదు. పోనీ ఏదైనా శాపం వల్లే నేతలు చనిపోతారన్నది నిజమే అని పురాణ ప్రవచనకర్త గరికపాటి భావిస్తుంటే ఆయన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. 

మహాత్మా గాంధీని గాడ్సె దారుణంగా కాల్చి హత్యచేశాడు. దేశ ప్రధానిగా ఉన్న  లాల్ బహదూర్ శాస్త్రి రష్యాలో మరణించిన తీరు మిస్టరీ. మరో ప్రధాని ఇందిరాగాంధీ భద్రతా సిబ్బంది  జరిపిన కాల్పులలోనే చనిపోయారు. ఇంకో ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీలంక తీవ్రవాదులు బాంబులు పేల్చి హత్యచేశారు. ఇందిరాగాందీ రెండో కుమారుడు సంజయ్ గాందీ హెలికాఫ్టర్ కూలి మరణించారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన రోజుల్లోనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూడా గల్లంతైపోయింది. 

టిడిపి నేతలు ఎర్రన్నాయుడు, హరికృష్ణ, లాల్ జాన్ భాష లు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పదవీచ్యుతుడై కుటుంబం నుంచే ఘోర పరాభవంతో కుమిలి, కుమిలి మరణించారు. మాజీ ప్రధాని, గొప్ప నేత అయిన అటల్ బిహారీ వాజ్ పేయి తన చివరి సంవత్సరాలలో జ్ఞాపక శక్తి కోల్పోయి చాలాకాలం మంచానికే పరిమితం అయ్యారు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉదాహరణలు ఉంటాయి. వీళ్లంతా గొప్పవారు. 

కాని వారి జీవితాలు ఇలా ముగియడం దురదృష్టకరం. కాని అంత మాత్రాన ఏదో శాపం అనో, పాపం అనో ఆద్యాత్మికవేత్తలు వ్యాఖ్యానిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి? అందువల్ల గరికపాటి వంటివారు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. మరో సంగతి. ఆద్యాత్మికవేత్తలకు మరీ కోపం ఎక్కువ ఉండకూడదు. కాని అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి గరికపాటి అంత కటువుగా వ్యవహరించి ఉండవలసింది కాదు. ప్రశాంతంగా ఉండవలసిన ఆద్యాత్మికవేత్తలు తోటి ప్రముఖుడిపైనే ఫైర్ అయితే, వారు చెప్పే ప్రవచనాలకు, శాంతి వచనాలకు ఏమి విలువ ఉంటుంది?

వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, 
సీనియర్‌ పాత్రికేయులు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement