జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు తెలియకుండానే తెలుగుదేశం పరువు తీసేశారు. ఆ పార్టీకి బీజేపీ వద్ద విలువ లేదని, చాలా చులకన భావన ఉందని ఆయన తేల్చి చెబుతున్నారు. అందుకే తాను భారతీయ జనతా పార్టీని టీడీపీ చెంతకు చేర్చడానికి పడరాని పాట్లు పడుతున్నాని అంటున్నారు. ఆయన ప్రకటనతో ఒక విషయం అర్దం అయ్యేది ఏమిటంటే బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదని. టీడీపీ విశ్వసించదగ్గ పార్టీ కాదని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని నమ్మజాలమని బీజేపీ భావిస్తున్నట్లు అనుకోవాలి.
అయినా.. ఎందుకు పవన్ కల్యాణ్ రాజకీయదళారీ అవతారం ఎత్తారు? అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఆయన స్వార్ధం ఆయనది. తాను ఒంటరిగా పోటీచేసినా, బీజేపీతో కలిసి పోటీచేసినా ఎమ్మెల్యేగా గెలవలేనన్నది ఆయన భయం కావచ్చు. తెలుగుదేశం కూడా కలిస్తే తాను గట్టెక్కుతానని ఆయన భావిస్తుండవచ్చు. దీనికి రాష్ట్ర ప్రయోజనాలు అంటూ ముసుగువేసే ప్రయత్నం చేస్తూ ప్రజలను మోసం చేయాలని పవన్ యత్నిస్తున్నారు. ఆయన చెప్పే మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు కానీ, టీడీపీ పట్ల బీజేపీ ఎంత ఏహ్య భావంతో ఉన్నది ఆయన తెలియచేసిన తీరు మాత్రం కాస్త నమ్మదగిందే అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ ఈ విషయం చెప్పినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ లోపల, లోపల కుమిలిపోవడం తప్ప ఏమీ అనలేకపోతున్నారు.
పవన్ కల్యాణ్ ఇంతలా పరువు తీస్తున్నారేమిటి? అన్న బాధ ఉన్నా, జనసేన పొత్తు లేకపోతే ఈపాటి పోటీ కూడా ఇవ్వలేమన్నది వారి సందేహం. సాధారణంగా మిత్రపక్షంగా ఉన్న పార్టీ పట్ల గౌరవ ప్రదంగా ఉంటారు. చిత్రమేమిటంటే? టీడీపీకి పూర్తిగా లొంగిపోయిన పవన్ కల్యాణ్ టీడీపీవల్ల తాను నలిగిపోతున్నానని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలలో ఉన్న విషయం గమనించండి.. "తేదేపా, భాజాపాతో కలిసి వస్తున్నందున ఏ శక్తి మనల్ని ఆపలేదు.. రాష్ట్రాన్ని కాపాడడానికి మూడు పార్టీల పొత్తు ద్వారా కృషి చేస్తున్నా.. దీనికోసం ఎంతో నలిగిపోయా! జాతీయ నాయకులతో చివాట్లు తిన్నా.. రెండు చేతులెత్తి దండం పెట్టి మా రాష్ట్రం కోసమని ప్రాధేయపడ్డా" అని అన్నారట.
నిజంగానే ఈ మాట బీజేపీ జాతీయ నేతలతో అన్నారో, లేదో కానీ, ఇక్కడ మాత్రం బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. బీజేపీ నేతలు వాస్తవంగానే టీడీపీతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్‌ను చివాట్లు పెట్టి ఉంటే, ఆ పార్టీ పొత్తుపై ఎలా ముందుకు వెళుతుందో అర్ధం కాదు! ప్రధాని మోదీని దూషించిన చంద్రబాబుతో కలిసి జూనియర్ పార్ట్నర్‌గా బీజేపీ ఎలా పనిచేస్తుందో తెలియదు. పవన్ కల్యాణ్ ఆత్మగౌరవంతో ఎటూ ఉండరు కనుక, తన తల్లిని దూషించిన టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నారు కనుక, ఇప్పుడు మోదీని, ఆయన భార్యను అవమానించిన టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని పవన్ కల్యాణ్ బీజేపీ నేతలను బతిమలాడుతున్నారని భావించాలి.
ఇందులో మరో కోణం కూడా ఉండవచ్చు. టీడీపీ అంటే బీజేపీ యావగించుకుంటున్నా, తాను నలిగిపోతున్నా టీడీపీని కలపడానికి యత్నిస్తున్నానని చెప్పడం ద్వారా పవన్ కూడా ఏమైనా గేమ్ ఆడుతున్నారా అన్న డౌటు వస్తుంది. గతంలో జనసేనకు పదో, పరకో సీట్లో పడేస్తామన్న తెలుగుదేశంను బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా మరి నాలుగు సీట్లు ఎక్కువగా సంపాదించుకోవాలని పవన్ ఏమైనా ఇలా ఆ పార్టీ గాలి తీసేస్తున్నారేమో అనిపించవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. తెలంగాణలో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవచ్చని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. దానిని ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ నేతలు ఒక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అవినీతి కూపంలో కూరుకుపోయిందని, అందువల్ల ఆ పార్టీతో పొత్తు ప్రసక్తి లేదని అన్నారు.
అలాంటప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే చంద్రబాబును ఉద్దేశించి పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్‌గా వాడుకున్నారని ఆరోపించారు. అంతేకాక చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ప్రకటించారు. ఏపీ సీఐడి ఈ మధ్య కాలంలో చంద్రబాబుపై పలు అవినీతి కేసులు పెట్టింది. వందల, వేల కోట్ల కుంభకోణాలు చంద్రబాబు హయాంలో జరిగాయని, ఆయనను వివిధ కేసులలో ఎ1 గా చేర్చింది. ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్న చంద్రబాబుతో బీజేపీ ఎలా చెలిమి చేస్తుంది? దానికోసం పవన్ కల్యాణ్ ఎలా పాటు పడుతున్నారు? అసలు పొత్తు గురించి చెప్పవలసిన బీజేపీ ఎందుకు నోరు విప్పడం లేదు? కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి పొత్తుకై బతిమలాడుకుని వచ్చినా, ఇరవైరోజులుగా ఎందుకు స్పందించడం లేదు!
రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఈ విషయంలో ఏమీ చెప్పలేకపోతుంటే పవన్ కల్యాణ్ మాత్రం తాను పొత్తు కుదిర్చేసినట్లు మాట్లాడుతున్నారు. పైగా చివాట్లు తిన్నానని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ప్రతిపాదనతో తిట్లు తిన్నారా? లేక తమతో రాజకీయ పెళ్లి చేసుకుని, లేచిపోయి టీడీపీతో కాపురం చేస్తున్నందుకు పవన్ కల్యాణ్‌ను మందలించారో అర్ధం కావడం లేదు! ఇంత అనైతిక, అక్రమ రాజకీయ బంధానికి బీజేపీ ఒప్పుకుంటే ఆ పార్టీ చెప్పే నీతికబుర్లన్నీ బోగస్ అని జనం అనుకునే అవకాశం లేదా!ఏది ఏమైనా పవన్ కల్యాణ్ టీడీపీతో పాటు బీజేపీ ప్రతిష్టను కూడా పరోక్షంగా దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. దీనిపై ఒక బీజేపీ నేత మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళుతున్నట్లు కొన్ని పత్రికలు రాశాయి. ఆయన ఎందుకు వెళ్లలేదో తెలియదని అన్నారు.
మరో వైపు పవన్ కల్యాణ్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్య కూడా చంద్రబాబుకు ఒక బాణంలా గుచ్చుకుంటుంది. వయసు మీరినవారు రిటైర్ కాకపోతే కొత్తవారికి ఎలా అవకాశాలు వప్తాయని ఆయన ప్రశ్నించారు. బహుశా రాజమండ్రి రూరల్ సీటు విషయంలో టీడీపీ, జనసేనల మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఈ వ్యాఖ్య చేసినా, అది చంద్రబాబుకు కూడా తగులుతుంది. రాజమండ్రి రూరల్ సీటును సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆశిస్తున్నారు. అదే సీటును జనసేన నేత కందుల దుర్గేష్ పట్టుబడుతున్నారు.
దుర్గేష్‌కు మద్దతుగా పవన్ కల్యాణ్ ఈ మాట అన్నా, సహజంగానే బుచ్చయ్య వయసులోనే ఉన్న చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది కదా! ఆయనకు కూడా పవన్ కల్యాణ్ ఇదే సలహా ఇచ్చారా అని అంటే ఏమని చెబుతాం. మరో సంగతి చెబుతున్నారు. ఎన్నికలలో డబ్బు ఖర్చుపెట్టాలని, ఓట్ల కొనుగోలు విషయంలో కూడా తగ్గవద్దని అన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు పవన్ కల్యాణ్ ఆలోచనల డొల్లతనం తెలియచేస్తుంది. ఇంతవరకు రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు చేస్తున్నా, ఆ మాటను నేరుగా చెప్పడం లేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం దానిని కూడా వదలివేసి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటే ఇలాంటివారు అధికారంలోకి వస్తే అవినీతిని కూడా అదే రీతిలో బహిరంగంగానే ప్రోత్సహిస్తారేమో!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment