అసలు ఆ సభలు ఏమిటి? ఆ జనం ఏమిటి? ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీ రాజకీయాలు చూస్తున్న జర్నలిస్టులకు కూడా అంతు చిక్కని రీతిలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సిద్దం సభలు విజయవంతం అయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఏపీలో భారీ సభలు మొదలయ్యాయి. ప్రజా గర్జన పేరుతోనో, మరో పేరుతోను ఐదేళ్లకు ఒకసారి ఇలాంటి సభలు నిర్వహించేవారు. ఉదాహరణకు 1994 శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్‌టీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఒక సభ నిర్వహించారు. అప్పుడు తెలుగుదేశం నేతలు పోటీలు పడి ప్రజలను సమకీరించారు. ఇప్పుడు అలాంటి సభలు ఏకంగా నాలుగు నెలల్లో నాలుగు నిర్వహించడం అంటే తమాషా కాదు. ఇందిరాగాంధీ, ఎన్‌టీఆర్ వంటి హేమాహేమీల వల్లే కాని పని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంత సునాయాసంగా చేసేస్తున్నారు!
భీమిలి వద్ద జరిగిన సిద్దం సభ చూసిన తర్వాత జనంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు బాగానే పలుకుబడి ఉంది.. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆయన జనాకర్షణ శక్తి తగ్గలేదులే అనుకున్నారు. దానిని మించి దెందులూరు సిద్దం సభ జరిగింది. తదుపరి రాయలసీమలో అనంతపురం వద్ద రాప్తాడు వద్ద ఊహించలేనంత జనంతో సిద్దం సభ జరిగింది. అంతటితో సభలు అయిపోయాయని అనుకుంటే, మళ్లీ దక్షిణ కోస్తాలో మేదరమెట్ట వద్ద అత్యంత భారీ ఎత్తున సభ జరిపారు. వీటన్నిటిలోను ఒకరే స్టార్ స్పీకర్. మిగిలిన నేతలు ప్రసంగాలు చేసినా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీచ్ కోసమే అంతా ఎదురు చూపులు. సరిగ్గా చెప్పిన టైమ్ ప్రకారం నాలుగు గంటల ప్రాంతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రావడం, ప్రజలకు అభివాదం చేస్తూ రాంప్‌వ్యాక్ చేయడం, తదుపరి ప్రసంగం ఆరంభించి సుమారు గంట నుంచి గంటంబావు సేపు మాట్లాడడం.. ఇదంతా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతున్నాయి.
వందల ఎకరాలలో సభలు పెట్టడం, వాహనాల పార్కింగ్ కోసమే వంద ఎకరాలు కేటాయించడం.. అయినా ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, అది మొత్తం క్లియర్అవడానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటలు పట్టడం. పోని వచ్చిన జనం ఏదో వచ్చాంలే.. వెళ్లాంలే అన్నట్లు ఉంటున్నారా! ఊహూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పే ప్రతిమాటకు స్పందించడం, ఉర్రూతలూగడం, ఉత్సాహంతో ఉరకలెత్తడం.. నినాదాలు చేయడం.. ఐదేళ్ల అధికారం తర్వాత ఒక రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఇన్ని సభలను ఒక రాజకీయ పార్టీ పెట్టడం నేనైతే చూడలేదు. నలభైఆరు సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్న నాకు ఇదంతా కలయో, వైష్ణవ మాయో అన్నట్లుగా ఈ సభలు జరిగిపోయాయనిపిస్తుంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా సందర్భాలలో ఒక ప్రశ్న వేస్తే చాలు.. సభలో ఉన్న జనమే సిద్దం..సిద్దం అని నినదించడం, అలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్దమా అని అడగ్గానే అదే హోరు.. వందల కిలోమీటర్లను లెక్కపెట్టకుండా జనం తరలి వచ్చి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటే ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న అంచనాలు రాకుండా ఎలా ఉంటాయి!. అందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యపోవాలి. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఢిల్లీలో రోజుల తరబడి పడిగాపులు పడి ఉండడం, అంతకుముందు నెల రోజులకు పైగా బీజేపీ పెద్దల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తుండడం వంటి ఘట్టాలు గమనించాం. మరో వైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎవరితో పొత్తులతో పని లేకుండా ఒంటరిగా ప్రజలే తన స్టార్ ప్రచారకర్తలు అంటూ ఈ స్థాయిలో సభలు పెడుతుంటే ప్రత్యర్దులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తక ఏమి అవుతుంది.
కొద్ది రోజుల క్రితం తాడేపల్లిగూడెం వద్ద టీడీపీ, జనసేన పక్షాలు కలిసి నిర్వహించిన సభకు జనం కోసం కొన్ని గంటలు ఎదురు చూడవలసి వచ్చిందట. మరి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్దం సభలకు ఉదయం నుంచే జనం రావడం. ఒక వృద్ద మహిళ మేదరమెట్ల సభకు ఉదయం పది గంటలకల్లా వచ్చి కూర్చున్నారట. అదేమిటి అని తన మనవడిని చూడడానికి అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఉద్దేశించి అన్నారట. ఆ స్థాయిలో పేదల గుండెల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజంగానే స్థానం సంపాదించుకోవడం చరిత్రలో ఎన్నడూ చూడలేదనే చెప్పాలి. ఇంత భారీగా సభలు జరిగితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, వారి టీవీ మీడియాలలో ఏమని ప్రచారం చేస్తున్నారు? జనం లేరని, గ్రాఫిక్స్ వేసుకుంటున్నారని ఇలా ఏవేవో కుళ్లు వార్తలు ప్రచారం చేసి పరువు పోగొట్టుకున్నారు. టీవీలలో లైవ్ కవరేజీ ఇచ్చేటప్పుడు గ్రాఫిక్స్ వేయడం కుదరదన్న సంగతిని కూడా విస్మరించి అజ్ఞానంతో అబద్దాలు రాసేస్తున్నారు. వారి ద్వేషం ఆ స్థాయిలో ఉంది... టీడీపీ సభలలో చంద్రబాబు బోరు కొట్టించే ఉపన్యాసం వినలేక జనం మధ్యలో వెళ్లిపోతుంటే, దాని గురించి ఒక్క ముక్క రాయరు. బ్రహ్మాండంగా జరిగిన వైఎస్సార్‌సీపీ సభలపై మాత్రం విషం కక్కుతుంటారు.
ఆర్టీసీ బస్‌లను వైఎస్సార్‌సీపీ వారు వాడితే ప్రయాణికులకు అసౌకర్యమట. అదే చిలకలూరిపేటలో టీడీపీ కూటమి నిర్వహించే సభకు ఆర్టీసీ వాహనాలు ఇస్తే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదట.. ఇది ఈనాడు దిక్కుమాలిన జర్నలిజం. ఏది ఏమైనా సభల స్టైల్‌లో కాని, జన సమీకరణలో కాని, వారికి సదుపాయాల కల్పనలో కాని, ఇతరత్రా అన్ని విషయాలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితమైన ప్రమాణాలు నెలకొల్పడం విశేషం. అందువల్లే వచ్చిన జనం ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా సభలో పాల్గొని వెళుతుంటారు. ఈ నేపధ్యంలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పొత్తు ప్రజలతోనేనని గర్వంగా ప్రకటించుకుంటున్నారు.
చంద్రబాబు, పవన్‌లకు ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. ఒంటరిగా అయితే ఎట్టి పరిస్థితిలోను గెలవలేనన్న భయంతో చంద్రబాబు కాళ్లా, వేళ్లాపడి పొత్తులు పెట్టుకుంటున్నారు. అయినా వీరంతా కలిసినా వారికి వచ్చేది బండ సున్నానేనని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమాగా సభలో చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇన్ని భారీ సభలు చేసిన తీరు కాని, అందులో ప్రసంగించిన వైనం కాని, దానికి ప్రజలు స్పందించిన విధానం కాని చూశాక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయమన్న విశ్వాసం కలుగుతుంది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలు ఆయనను ఓన్ చేసుకుంటున్న పద్దతి గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పాలి. ప్రజలకు పాలనలో విశేషమైన మార్పులు తెచ్చి అందిస్తున్న ఈ సేవలు కొనసాగాలంటే వైఎస్సార్‌సీపీ ఎన్నుకోక తప్పని అనివార్య పరిస్థితిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సృష్టించుకోగలిగారంటే అతిశయోక్తి కాదని చెప్పాలి.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment